Homeఫ్లాష్ ఫ్లాష్మేయర్‌ పీఠం భాజపాదే అని నమ్ముతున్న: అమిత్‌షా

మేయర్‌ పీఠం భాజపాదే అని నమ్ముతున్న: అమిత్‌షా

హైదరాబాద్‌: దారిపొడవుగా అంగుళం ఖాళీ లేకుండా తనకు స్వాగతం పలికిన హైదరాబాద్‌ వాసులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు.

సీట్లు పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామన్నారు. రోడ్‌షోలో ప్రజల ఆదరణ చూశాక హైదరాబాద్‌ మేయర్‌ పీఠం భాజపాదే అని నమ్ముతున్నట్లు చెప్పారు.

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో రోడ్‌షో నిర్వహించిన అనంతరం భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులిస్తోందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు నగర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.

హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందన్నారు.

బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తోందని, సిటీలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.

కేసీఆర్ ఎవరితోనూ సమావేశం కాలేదని విమర్శించారు. తన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘గత ఎన్నికల తర్వాత వంద రోజుల ప్రణాళిక అన్నారు.. ఏమైంది? లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది? ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయింది. హుస్సేన్‌ సాగర్‌ను శుద్ధి చేస్తాం.. పర్యాటక కేంద్రంగా మారుస్తాం అన్నారు. ఏమయ్యాయి అవి. ప్రజలకు ఆయుష్మాన్ భారత్‌ ఫలాలు అందకుండా అడ్డుకున్నారు’’ అంటూ విమర్శించారు.

తమకో అవకాశం ఇస్తే ఐటీ పరంగా మరింత అభివృద్ధి చేస్తామని.. సుపరిపాలన అందిస్తామని చెప్పారు. తాము వాగ్దానం చేశామంటే అమలు చేసి తీరుతామన్నారు.

ఎంఐఎంతో రహస్య ఒప్పందం ఎందుకు?
‘‘నగర అభివృద్ధికి కేంద్రం అనేక విధాలుగా సాయం చేసింది. కేసీఆర్‌ ఎప్పుడైనా సచివాలయానికి వెళ్తే కదా కేంద్రం ఇచ్చే నిధుల గురించి తెలిసేది!

వరదల వచ్చినపుడు హైదరాబాద్‌కు రెండు విడతల్లో సుమారు రూ.500కోట్ల నిధులిచ్చాం. పేదల ఇళ్లు కట్టేందుకు కేంద్రం రూ.వేల కోట్లు ఇస్తోంది.

వీధి వ్యాపారుల పథకాన్ని తెరాస ప్రభుత్వం అమలు చేయడం లేదు. రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తోంది. పరిపాలనా సామర్థ్యం ఇంకెవరికీ లేదా?

రాజకీయాల్లో పొత్తులు సహజం. ఎవరు ఎవరితోనైనా అవగాహన ఒప్పందం పెట్టుకోవచ్చు.

ఎంఐఎంతో తెరాసకు రహస్య ఒప్పందం ఎందుకు?బహిరంగంగానే పొత్తు పెట్టుకోవచ్చు కదా? ఇవి గల్లీ ఎన్నికలు అనే వాళ్లు.. గల్లీలను ఎందుకు అభివృద్ధి చేయలేదు?’’ అని అమిత్‌షా ప్రశ్నించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img