– వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
– ఆరోగ్యశ్రీ చేయూత పథకం ప్రారంభం
ఇదేనిజం, హన్మకొండ : ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో సోమవారం హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోగ్య శ్రీ చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వమే వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటిదాకా ఈ పథకం కింద ఒకొక్క కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు పరిమితి ఉండేదని, ఇప్పుడు దీన్ని రెట్టింపు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాంబశివరావు, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్ శ్రీమాన్, రెడ్‌క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబరు ఈవీ శ్రీనివాస్ పాల్గొన్నారు.