ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజుల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ సూచించింది. ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మంచు కురుస్తుందని పేర్కొంది. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని తెలిపింది.
బుధవారం రాత్రి రాష్ట్రంలోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో 10.8, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 10.9, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు గురువారం ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు అధికంగా 31.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హైదరాబాద్, మెదక్, నల్గొండలలో సాధారణం కన్నా స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి.