Homeజాతీయంకేరళలో హై రిస్క్ వైద్య పరికరాల బయోమెడికల్ పార్క్

కేరళలో హై రిస్క్ వైద్య పరికరాల బయోమెడికల్ పార్క్

మెడికల్ ఇంప్లాంట్లు, ఇతర కీలక వైద్య పరికరాలు తయారీ దీని ప్రత్యేకత
వైద్యంలో ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేస్తూ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం

దేశంలో వైద్య పరికరాలు తయారు చేసే పరిశ్రమలతో కూడిన మొట్ట మొదటి మెడికల్ డివైజెస్ పార్క్ కేరళలో రూపుదిద్దుకోబోతోంది. హై రిస్క్ మెడికల్ పరికరాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తూ, ఆ రంగంలో పూర్తి స్థాయి సేవలందించే బయో మెడికల్ పార్క్ గా ఇది సాకారం కానుంది. వైద్య పరికరాల తయారీ రంగంలో పరిశోధన – రూపకల్పన, పరీక్ష విధానం, వైద్య పరికరాల పనితీరుపై అంచనా వంటి అంశాల్లో పూర్తి స్థాయి సేవలను ఈ మెడికల్ పార్క్ అందిస్తుంది.

  మెడ్.స్పార్క్ పేరిట ఈ పార్క్ ఏర్పాటు కాబోతోంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే చిత్ర తిరుణాల్ వైద్యవిజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి.),  కేరళ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (కె.ఎస్.ఐ.డి.సి.), కేరళ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఉమ్మడి చొరవతో ఈ బయోమెడికల్ పార్క్ ఏర్పాటు కానుంది. తిరువనంతపురం, తొణ్ణక్కల్ ప్రాంతంలో ఉన్న జీవ శాస్త్రాల పార్క్ లో ఈ పార్క్ ను నిర్మించనున్నారు.

  కీలకమైన శస్త్ర చికిత్సలో వినియోగించే ముఖ్యమైన వైద్య పరికరాల తయారీపై ఈ సంస్థ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తుంది. శరీరం అంతర్భాగంగా అమర్చే చేసే హై రిస్క్ యాంత్రిక ఇంప్లాంట్ల తయారీకి ఈ సంస్థ ప్రాధాన్యం ఇస్తుంది. పార్క్ నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. సంస్థకు హైరిస్క్ ఇంప్లాంట్ల తయారీ రంగంలో మంచి పరిజ్ఞానం ఉంది.

    కీలకమైన వైద్య పరికరాలకు సంబంధించి వాటి పనితీరుపై అంచనా, పరీక్ష విధానం, పరిశోధన-రూపకల్పన తదితర అంశాల్లో పూర్తి స్థాయి సేవలందించే వ్యవస్థను ఈ సంస్థ కల్పిస్తుంది. తయారీ మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన సృజనాత్మకత, పరిజ్ఞాన వ్యాప్తి తదితర అంశాలకు సంబంధించి వైద్య పరికరాల తయారీ రంగానికి అవసరమైన సేవలన్నింటినీ ఈ సంస్థ అందిస్తుంది. మెడ్.స్పార్క్ పరిధిలోని వైద్య పరికరాల పరిశ్రమలతో పాటుగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఈ తరహా పరిశ్రమలు కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. దీనితో వైద్య పరికరాల తయారీ రంగంలో ఉన్న చిన్న, మధ్యతరహా మెడికల్ డివైజెస్ తయారీ పరిశ్రమలకు ఈ పార్క్ ప్రయోజనకరంగా ఉంటుంది. 

  “బయోమెడికల్ పరికరాల తయారీ రంగంలో శ్రీ చిత్ర తిరుణాల్ సంస్థ 30ఏళ్లకు పైగా గణనీయమైన సేవలందిస్తూ వస్తోంది. ఈ రంగంలో అగ్రగామి సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దేశంలోని బయో మెడికల్ పరికరాల తయారీ పరిశ్రమల రంగంలో ఇది గొప్ప మైలురాయి. గౌరవ ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం కావడానికి పూర్తిగా అనుగుణమైనది” అని నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్ అన్నారు. చిత్ర తిరుణాల్ వైద్యవిజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞాన సంస్థకు ఆయన అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు.

   “దేశంలో తలపెట్టిన ఇతర బయో మెడికల్ పరికరాల పరిశ్రమలతో పోలిస్తే, ఈ మెడికల్ పరికరాల తయారీ పార్క్ ఎంతో విభిన్నమైనది. ఎందుకంటే ఇది కీలకమైన హైరిస్క్ వైద్య పరికరాలు, ఇంప్లాంట్ల తయారీపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఇదే రంగంలో చిత్ర తిరుణాల్ వైద్యవిజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞాన సంస్థకు గణనీయమైన నైపుణ్యం, అనుభవం ఉంది” అని కేంద్ర విజ్ఞాన శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ వ్యాఖ్యానించారు. 

   “కేంద్ర విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక విభాగం,.. సాంకేతిక పరిజ్ఞాన పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన బయోమెడికల్ పరికరాల తయారీ పథకంలో భాగంగా ఈ పార్క్ ఏర్పాటవుతోంది. కేరళ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటవుతోంది. నగరంలోని పలు పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలు, ఆరోగ్య రక్షణ సంస్థల సహకారంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, నీతీ ఆయోగ్ మద్దతుతో ఈ పార్క్ ఏర్పాటు సాధ్యమవుతోంది.” అని చిత్ర తిరుణాల్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ అశా కిశోర్ చెప్పారు.

  కేరళ రాష్ట్రంలో అందుబాటులో ఉండే సానుకూల అంశాలను హై రిస్క్ వైద్య పరికరాల తయారీకోసం మెడ్.స్పార్క్ సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏటా, రూ. 750కోట్ల రూపాయల వాణిజ్యం సాగించే అనేక వైద్య పరికరాల తయారీ సంస్థలు కేరళలో ఉన్నాయి. అవన్నీ చిత్ర తిరుణాల్ సంస్థనుంచి బదిలీ అయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ వస్తున్నాయి.

మెడ్.స్పార్క్నిర్మాణంపూర్తయితేఅందుబాటులోకివచ్చేసదుపాయాలుఇవే:

  • అంతర్జాతీయ ఏజెన్సీలతో అధీకృతమైన సంబంధాలు కలిగిన వైద్య పరికరాల పరీక్ష, అంచనా కేంద్రం.
  • వైద్య పరికరాల తయారీ రంగంలో పరిశోధన-రూపకల్పన సౌకర్యాలను కల్పించే పరిశోధనా వనరుల కేంద్రం. పార్క్ పరిధిలోని అన్ని పరిశ్రమలు ఈ కేంద్రం సేవలను వినియోగించుకోవచ్చు.
  • నైపుణ్యాల నవీకరణకోసం కేంద్రీకృత విజ్ఞాన కేంద్రం… శిక్షణ ఇచ్చేందుకు, ఇతర నియంత్రణ అంశాలకు, క్లినికల్ ప్రయోగాత్మక పరీక్షలకు తగిన సదుపాయం ఈ కేంద్రంలో  ఉంటుంది.
  • సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యం కోసం ఒక ఇన్ క్యుబేషన్ కేంద్రం… స్టార్టప్ కంపెనీలు, తొలిదశ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు ఈ ఇన్ క్యుబేషన్ కేంద్రం దోహదపడుతుంది.
  • పార్క్ కు వచ్చే పరిశ్రమలకు లీజుకు ఇచ్చేందుకు వీలుగా సడలింపునకు అవకాశం ఉన్న యూనిట్లు. తయారీ యూనిట్లు ఏర్పాటుకు అవసరమైన మాడ్యులర్ ప్లాట్లు..
  • మెడ్.స్పార్క్ వాణిజ్య నమూనా ఎంతో స్వావలంబనతో కూడుకున్నది. రెవెన్యూ మార్గాల ద్వారా నిర్వహణా ఖర్చులకు వనరులు లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర (కేరళ) ప్రభుత్వాలనుంచి వివిధ పథకాల ద్వారా అందే నిధులు,.. పెట్టుబడి వ్యయానికి, తొలినాళ్లలో ఆదాయంలో ఏర్పడే లోటును భర్తీ చేసుకోవడానికి సరిపోతాయి.
  • ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 12వందల మందికి నేరుగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని భావిస్తున్నారు. ప్రాజెక్టుకు మద్దతుగా ఏర్పడే పరిశ్రమల ద్వారా,..అంటే, ఒ.ఇ.ఎం. సరఫరాదార్లు, సేవలు అందించే సంస్థలు, మార్కెటింగ్/మార్కెటింగ్ అనంతర కార్యకలాపాలు సాగించే సంస్థల ద్వారా 4వేలనుంచి 5వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పన జరిగే అవకాశాలున్నాయి.

Recent

- Advertisment -spot_img