Homeరాజకీయాలుఅన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ముందంజ

అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ముందంజ

– కాంగ్రెస్​వి అమలుకు సాధ్యం కాని హామీలు
– బీఆర్ఎస్​ను జనం​ గద్దె దింపడం ఖాయం
– కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

ఇదే నిజం, హైదరాబాద్: అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీకి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు, షెడ్యూల్‌ తెగల ప్రజలు బీజేపీని విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఒక నిశబ్ద విప్లవం తరహాలో బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా ఓటేయాలని జనం చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రచార రథాలను గ్రామాల్లోకి రానివ్వకుండా ప్రజలే అడ్డగిస్తున్న పరిస్థితి నెలకొంది. దళితబంధు, రుణమాఫీ, బీసీ బంధు, దళిత సీఎం హామీలు నెరవేర్చలేదని ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు పోలీసులకు భయపడిన వారు కేసీఆర్‌ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని నిర్ధారించుకొని ముందుకొస్తున్నారు. కొన్ని సర్వే సంస్థలు దొంగ లీకేజీలు ఇస్తున్నా బీజేపీ అభ్యర్థులకు ఆదరణ తగ్గడం లేదు. బీజేపీ మేనిఫెస్టోపై జనం సానుకూలంగా స్పందిస్తున్నారు. బీసీ సీఎం హామీ వారిని ఆకర్షించింది. యువత నరేంద్రమోడీకి అండగా నిలబడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ కుటుంబాల నుంచి వచ్చినవారు సైతం బీజేపీకి మద్దతిస్తున్నారు. ఏదైనా ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడే పార్టీ బీజేపీ అని అంతా భావిస్తున్నారు. మిగతా పార్టీల నేతలు మాట్లాడే మాటలు కోటలు దాటుతాయి.. కానీ వారు చేసే పనులు ప్రగతి భవన్‌, గాంధీభవన్‌ కూడా దాటవు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్‌ అనేక గ్యారంటీలు ఇచ్చింది. ఈ దేశ, రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ విషాదమే మిగిల్చింది. కాంగ్రెస్‌ కారణంగా తెలంగాణ అనేక రకాలు నష్టపోయింది. తొలి విడత ఉద్యమంలో 365 మందిని, మలి విడతలో 1200 మంది విద్యార్థులను బలితీసుకుంది. ఆ పార్టీ ప్రస్తుతం ఇస్తున్న ఫేక్‌ గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’అని కిషన్‌రెడ్డి అన్నారు.

Recent

- Advertisment -spot_img