ఇదే నిజం, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 9న శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగా.. అదే రోజున వివిధ పార్టీలకు చెందిన 101 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. అయితే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించడంతో.. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్ ముందు తాము ప్రమాణం చేయబోమని స్పష్టం చేశారు. అయితే గురువారం ఉదయం స్పీకర్‌గా ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం సభలోకి అడుగుపెట్టి బీజేపీ సభ్యులు.. కొత్త స్పీకర్ ఎదుట ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకేశ్ రెడ్డి, రామారావ్ పవార్, ధన్‌పాల్ సూర్యనారాయణ, పాల్వాయి హరీశ్ బాబు ఉన్నారు.