Homeఫ్లాష్ ఫ్లాష్దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. ర‌ఘునంద‌న్‌కే ప‌ట్టం క‌ట్టిన ప్ర‌జ‌లు

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. ర‌ఘునంద‌న్‌కే ప‌ట్టం క‌ట్టిన ప్ర‌జ‌లు

హైద‌రాబాద్ః రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర‌ ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన విజయం ద‌క్కించుకున్నారు.

నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో 1470 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై విజ‌యం సాధించారు.

మొదటి పది రౌండ్స్‌లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా.. అనుహ్యంగా పుంజుకున్న టీఆర్‌ఎస్‌ 11 నుంచి 20 రౌండ్‌ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది.

కానీ చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్‌ఎస్‌ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది.

19వ రౌండ్‌ ముగిసే సరికి అధికార టీఆర్‌ఎస్‌ 450 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో దాదాపు విజయం ఖాయమనుకున్నారు.

అనుహ్యంగా వరుసగా 20, 21, 22, 23 రౌండ్స్‌లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. 20 రౌండ్లు ముగిసే సరికి బీజేపీకి 241 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది.

21వ రౌండ్‌లో 428 ఓట్లు, 22వ రౌండ్‌లో 438 ఓట్ల ఆధిక్యంతో పాటు 23వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం లభించడంతో 1470 ఓట్ల మెజార్టీతో రఘునందన్ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు.

ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు అన్నీ తానై వ్యవహరించినప్పటికీ.. ఓటర్లు రఘునందన్‌వైపే మొగ్గుచూపారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం..బండి సంజ‌య్‌

దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బండి సంజయ్‌ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు.

అనంత‌రం గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన బండి సంజయ్ మాట్లాడారు. దుబ్బాక గెలుపు అమరుడు శ్రీనివాస్‌కు అంకితమన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.

అమిత్ షా అభినంద‌న‌లు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయ‌ం సాధించడంపట్ల అభినందనలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రభంజనం కొనసాగిస్తం.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

దుబ్బాకలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చూపిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ఆయువుపట్టు ఏరియాలో గెలిచామని ఇది మామూలు విష‌యం కాద‌న్నారు.

ఈ విజ‌యంపై కిష‌న్‌రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందన్నారు. బీజేపీ శ్రేణుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్న‌రు..డీకే అరుణ‌

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పడానికి దుబ్బాక ఫలితమే నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

కేటీఆర్ స్పందన..

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై సమీక్షించుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము అన్నారు. ఆరున్నరేళ్లలో టీఆర్ఎస్ ఎన్నో విజయాలు నమోదు చేసుకుందని గుర్తుచేశారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలకు, గెలుపు కోసం శ్రమించిన మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు చెప్పారు.

ఓటమికి నాదే బాధ్యత.. మంత్రి హరీశ్ రావు

ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి తనదే బాధ్యత అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక ప్రజాతీర్పును శిరసావహిస్తామని ఆయన తెలిపారు.

ఓటమికి గల కారణాలు సమీక్షించుకొని లోపాలను సరిదిద్దుకుంటామని హరీశ్‌రావు చెప్పారు. దుబ్బాక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.

దుబ్బాకలో మొత్తం 1,62,516 ఓట్లు
బీజేపీ అభ్యర్థి రఘునందన్.. 62,773 ఓట్లు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత.. 61,302 ఓట్లు
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి.. 21,819 ఓట్లు
నోటా.. 552 ఓట్లు

ఉప ఎన్నిక‌ల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయగా 11 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం.

నాలుగు ఈవీఎంలలో 1,669 ఓట్లు జామ్‌

దుబ్బాక కౌంటింగ్‌లో 4 ఈవీఎంలు మొరాయించాయని సీఈవో శశాంక్‌ గోయిల్‌ చెప్పారు. 21 మరియు 188 పోలింగ్‌ కేంద్రాల్లో ఫలితాలు రాలేదన్నారు.

నాలుగు ఈవీఎంలలో 1,669 ఓట్లు ఉన్నాయని, వీవీ ప్యాట్‌లోని స్లిపులు లెక్కిస్తామని పేర్కొన్నారు.

136, 157/ఏ పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ తర్వాత క్లియర్‌ చేయలేదన్నారు. నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు చేపడుతామన్నారు.

Recent

- Advertisment -spot_img