ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణ సమర్థనీయమని పేర్కొంటూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పై ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
20 ఏళ్ల పోరాటం గెలిచింది: మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీయస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచిందన్నారు. ఆనాడు చంద్రబాబు వర్గీకరణ చేయడం వల్లే.. నేడు వర్గీకరణ సాధ్యమైందని చెప్పారు. రిజర్వేషన్ల వ్యవస్థలో రెండో అడుగు పడబోతోందన్నారు. వర్గీకరణకు అనుకూలమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణను అందరికంటే ముందు అమలుచేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
గత ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని చెప్పి, తీసుకువెళ్లకుండా మాదిగలను మోసం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని.. న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. దేశంలోనే అందరికంటే ముందుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని వెల్లడించారు. కొత్త ఆర్డినెన్స్ తెచ్చి.. ఇప్పుడు ప్రకటించిన ఉద్యోగాల్లోనూ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు.