HomeరాజకీయాలుBRS గూటికి నాగం, విష్ణువర్ధన్​

BRS గూటికి నాగం, విష్ణువర్ధన్​

– కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్​

– పాత, కొత్త నేతలతో కలిసి పనిచేయాలని సూచన

– ఫేక్​ సర్వేలతో రేవంత్​ టికెట్లు ఇస్తున్నారని నాగం జనార్ధన్​రెడ్డి, విష్ణువర్ధన్​రెడ్డి ఆరోపణ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీలో టికెట్​ ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మంగళవారం కాంగ్రెస్​ అసంతృప్త నేతలు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్​రెడ్డి, నాగర్​కర్నూల్ సీనియర్ నేత నాగం జనార్ధన్​రెడ్డి బీఆర్ఎస్​ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్​ వారికి తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ నాగం జనార్ధన్​రెడ్డిని, విష్ణువర్ధన్​రెడ్డిని హృదయపూర్వకంగా బీఆర్ఎస్​లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. నాగం జనార్ధన్​రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో ఎంతో చరిత్ర ఉందన్నారు. ఈ సారి పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు గెలవాలన్నారు. జూబ్లీహిల్స్​లో పాత, కొత్త నేతలు కలిసి పనిచేయాలన్నారు. నాగం కాంగ్రెస్ నుంచి నాగర్​కర్నూల్ టికెట్ ఆశించారు. రెండో జాబితాలో తనకు టికెట్ దక్కకపోవడంతో రేవంత్​రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఫేక్ సర్వేలతో రేవంత్ టికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల కాంగ్రెస్​కు రాజీనామా చేశారు. దీంతో మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు నాగం ఇంటికెళ్లి బీఆర్ఎస్​లోకి రావాలని ఆహ్వానించారు. అనంతరం తాను బీఆర్ఎస్​లో చేరుతానని చెప్పిన నాగం మంగళవారం సీఎం కేసీఆర్​ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్​లో కీలక నేత దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్​రెడ్డి టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్​ పార్టీకి గుడ్​ బై చెప్పారు. మంత్రి హరీశ్​రావు విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్​లోకి రావాలని ఆహ్వానించడంతో ఆయన కూడా కేసీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు.

Recent

- Advertisment -spot_img