- సొంతపార్టీ నుంచే అసమ్మతి గళం
- మహబూబాబాద్ లో 100 మంది ప్రజాప్రతినిధుల భేటీ
BRS MLA: ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. బీఆర్ఎస్ కు చెందిన దాదాపు 100 మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వొద్దంటూ గళమెత్తారు. ఇవాళ మహబూబాబాద్ శివారులోని ఓ మామిడి తోటలో ఆయనకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. దాదాపు 100 మంది బీఆర్ ఎస్ కు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ మీటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దు
శంకర్ నాయక్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ నేతలంతా గట్టిగా తేల్చి చెప్పారు. శంకర్ నాయక్ నియోజకవర్గంలో భూ కబ్జాలు, అవినీతికి పాల్పడుతున్నారని నేతలంతా ముక్తకంఠంతో నినదించారు. సీఎం కేసీఆర్ వెంటనే ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాలని కోరారు.
శంకర్ నాయక్ కు టికెట్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి.. నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సారి అన్ని పార్టీలకంటే ముందే టికెట్లు అనౌన్స్ చేయాలని కేసీఆర్ యోచిస్తున్న విషయం తెలిసిందే. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేకు సైతం టికెట్లు ఇవ్వొద్దని ఆయన భావిస్తున్నారు. కాగా తాజాగా మహబూబాబాద్ లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నేతలంతా ఏకం కావడం గమనార్హం.