ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన ఇప్పటివరకు బహిరంగసభల్లో, పత్రికా సమావేశాల్లో పాల్గొనలేదు. దీంతో కేసీఆర్ కు గ్రాండ్ ఎంట్రీ తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి వరంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ సర్కారు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన మినిట్స్ కూడా విడుదలయ్యాయి. దీంతోనే బీఆర్ఎస్ పోరాటానికి రెడీ అయ్యింది. నల్లగొండ సభను ఇందుకు వేదిక చేసుకున్నది. ఇక తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి రావడంతో తెలంగాణ వాదుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు రావడం మొదలైంది. ఇదిలా ఉంటే ఉత్పాతాన్ని ముందే గ్రహించిన కాంగ్రెస్ పార్టీ సోమవారం అసెంబ్లీలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని తీర్మానం చేసింది. తాము చలో నల్లగొండ సభకు పిలుపునివ్వడం వల్లే కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గిందని బీఆర్ఎస్ నేతలు ప్రకటించుకున్నారు. ఈ విషయాన్ని హరీశ్ రావు ఎంతో సక్సెస్ ఫుల్ గా అసెంబ్లీలో చెప్పుకున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనక ఈ అంశాన్ని ఎత్తుకోకపోతే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి వెళ్లిపోయేవని హరీశ్ అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు మొత్తం సభ ముందుంచారు.
నల్లగొండ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు?
ఇక నల్లగొండ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పాలు కాకుండా కాపాడామని రేపటి సభలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసుకొనే అవకాశం ఉంది. ఈ సభ ను పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభగా వాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇక తెలంగాణ హక్కులకు భంగం కలిగితే.. తెలంగాణ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ సర్కారు వెంటనే మేల్కొన్నది. రేపు ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డకు తరలివెళ్లనున్నారు. ఇటు కేసీఆర్ సభ, అటు ముఖ్యమంత్రి మేడిగడ్డ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ సర్కారు అవినీతి పాల్పడిందని చెప్పేందుకు కాంగ్రెస్ యత్నింస్తుండగా.. కాంగ్రెస్ హాయంలో తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతోందని.. బీఆర్ఎస్ ప్రచారం చేయబోతున్నది. ఈ రెండు అంశాలే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రధాన ఎజెండాగా మారబోతున్నాయి. ఇక నల్లగొండ సభకు బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. జనసమీకరణ కూడా చేశారు. మరి ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారో.. వేచి చూడాలి.