Homeరాజకీయాలుకారు జోరు.. హస్తం జోష్​

కారు జోరు.. హస్తం జోష్​

– రాష్ట్రంలో రెండు పార్టీల హోరాహోరి
– అంతుచిక్కని ఓటరు నాడి
– తలలు పట్టుకుంటున్న సెఫాలజిస్టులు
– కొన్ని సంస్థల పెయిడ్​ సర్వేలు
– కొంతమేర పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్​
– గ్రామాల్లో నిశ్శబ్ధ వాతావరణం
– ఊహించని రీతిలో కాంగ్రెస్​ పార్టీకి హైప్​
– సంక్షేమమే గెలిపిస్తుందని బీఆర్ఎస్​ లెక్కలు
– హంగ్​ ప్రభుత్వంపై బీజేపీ ఆశలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతున్నదంటే ఎవ్వరూ ఇదమిత్థంగా చెప్పలేకపోతున్నారు. మరో తొమ్మిది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. ఓటరు నాడి పట్టుకోవడం ఎంతో కష్టంగా మారింది. తలలుపండిన సెఫాలజిస్టులు సైతం గెలుపును అంచనా వేయలేకపోతున్నారు. మరోవైపు పెయిడ్​ సర్వేలు మరింత కన్ఫ్యూజ్​ చేస్తున్నాయి. ఇక మీడియా సంస్థలు సైతం ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారడంతో నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య టఫ్​ ఫైట్​ నడుస్తోంది. ఎవ్వరూ ఊహించని రీతిలో కాంగ్రెస్​ గ్రాఫ్​ పెరిగిన మాట వాస్తవమే. అయితే ఈ గ్రాఫ్​ అధికారం తెచ్చే స్థాయిలో ఉన్నదా? అన్నది డౌటే. ఇక హస్తం పార్టీ ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత, ఆరు గ్యారెంటీలను నమ్ముకున్నది. సంక్షేమపథకాలు తమను గెలిపిస్తాయని బీఆర్ఎస్​ భావిస్తోంది. దీంతో ఏ పార్టీ పరిస్థితి ఏమిటో ఎవ్వరికీ అంతుచిక్కకుండా పోతున్నది. ఇక రాజకీయ పార్టీలు అంతర్గతంగా చేయించుకుంటున్న సర్వేలు సైతం ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. దీంతో రెండు పార్టీల లీడర్లు ఎటూ తేల్చుకోలేపోతున్నారు.

కాంగ్రెస్ ఆశ ఇదే..


కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆశలు పెట్టుకున్నది. దీనికితోడు రాష్ట్రంలో కుటుంబపాలన, ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం.. పదేండ్లు ప్రజలు బీఆర్ఎస్​ పాలనను చూశారు కనక.. కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్​ ఇస్తారని వారు భావిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్​ పార్టీకి అనూహ్య స్పందన వస్తోంది. దీంతో ఆ పార్టీ లీడర్లు జోష్​తో ఉన్నారు.

బీఆర్ఎస్​కూ గట్టి నమ్మకం


ఇక రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలు తమకే ఓటు వేస్తారని బీఆర్ఎస్​ భావిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సైలెంట్​ మోడ్​ ఉందని.. ప్రజలంతా గులాబీ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్లు భావిస్తున్నారు. రైతు బంధు, సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, పింఛన్లు ఈ అంశాలు తమకు అనుకూలంగా ఉండబోతున్నాయని బీఆర్ఎస్​ భావిస్తోంది.

10 సీట్లపై బీజేపీ గురి


భారతీయ జనతాపార్టీకి ఈ దఫా అధికారం మీద పెద్దగా ఆశలేదు. అయితే ఓ 20 సీట్ల మీద ఆ పార్టీ ఫోకస్​ పెట్టింది. అందులో 10 స్థానాలపై సీరియస్​ గా దృష్టి సారించింది. తాము 10 స్థానాలు గెలిస్తే కింగ్ మేకర్స్​ అవుతామని ఆ పార్టీ భావిస్తోంది. ఇక ఆ పార్టీకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో 10 సీట్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఒకవేళ బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పార్టీ మధ్య టఫ్​ ఫైట్​ జరిగితే మాత్రం బీజేపీకి సీట్లు రాకపోవచ్చు. రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఫైట్​ జరిగితే ప్రజలు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి ఎంచుకుంటారు తప్ప.. మూడో పార్టీ వైపు చూడరు.

పోల్​ మేనేజ్​ మెంట్​ కీలకం


ఇక రెండు పార్టీ మధ్య నువ్వా నేనా ? అన్న రీతిలో ఫైట్​ సాగుతున్నప్పుడు పోల్​ మేనేజ్​ మెంట్ ఎంతో కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న ప్రచారాలు ఒక ఎత్తైతే .. ఎన్నికల ముందు రోజు ఓటర్ ను పోలింగ్​ బూతు వరకు తీసుకెళ్లడం మరో ఎత్తు. ఈ విషయంలో బీఆర్ఎస్​ పార్టీ ఆరి తేరింది. ఇక కాంగ్రెస్​ పార్టీ సైతం ఈ సారి సీరియస్​ గా దృష్టి సారించింది. చివరి రోజు డబ్బు, మద్యం ఏరులై పారితే అంచనాలు తలకిందులై ఫలితాలు మారే అవకాశం ఉంటుంది. డబ్బు పంపిణీ కూడా ఎంతో కీలకమయ్యే చాన్స్​ ఉంది. ఈ సారి బీఆర్ఎస్​, కాంగ్రెస్​ రెండు పార్టీలు డబ్బుకు వెనకాడటం లేదు. ఇక బీఆర్ఎస్​ ఇప్పటికే అభ్యర్థులకు రూ. 10 కోట్లదాకా చేరవేసిందని సమాచారం. కాంగ్రెస్​ పార్టీ సైతం ఇదే తరహాలో డబ్బులు పంపిణీ చేస్తోంది. ఒక్క రేవంత్​ రెడ్డే రాష్ట్రంలోని 50 మంది అభ్యర్థుల ఎన్నికల ఖర్చు భరిస్తున్నట్టు సమాచారం. ఆయనకు తోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఓ 10 మంది అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్టు టాక్​. ఇక కర్ణాటక నుంచి కూడా కాంగ్రెస్​ పార్టీకి భారీగా డబ్బు వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో డబ్బు పంపిణీ అంశం కూడా అత్యంత కీలకం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలవబోతున్నదో తెలియాలంటే డిసెంబర్​ 3 వరకు వేచి చూడాల్సిందే.

Recent

- Advertisment -spot_img