Cheater:ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని వివాహం చేసుకుని నగలు, నగదుతో పారిపోయిన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో రషీద అనే యువతితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని.. ఈ ఏడాది మార్చి 30న వివాహం చేసుకున్నారు. వివాహమైన కొన్ని రోజులకే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో రషీద ఈ నెల 4న ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు నగలతో అదృశ్యమైంది. మూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. నీలగిరి జిల్లా గూడలూర్‌కు చెందిన రషీద సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరచి డబ్బున్న మగవారితో పరిచయం పెంచుకుంటుందని గుర్తించారు.
తర్వాత వారిని వివాహం చేసుకుంటుందని, కొన్ని రోజుల తర్వాత ఇళ్లలో ఉన్న నగదు, నగలతో పారిపోతుందని తెలుసుకున్నారు. ఆమె ఇప్పటివరకు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎనిమిది వివాహాలు చేసుకున్నట్లు తేలింది. పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.