చైనా తాను కొత్తగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోకి గత నెలలో ‘లాంగ్ మార్చ్ 5 బి’ వాహనం ద్వారా తొలి మాడ్యూల్ ప్రయోగించింది.
అయితే, ఆ భారీ రాకెట్ శకలాలు అదుపు తప్పి భూమి పైకి పడనున్నాయి. ఈ వారాంతంలో అవి నేలపై పడనున్నాయని చెబుతున్నారు.
ఒక నిర్దేశిత దిశ లేకుండా అంతరిక్షంలో ప్రయాణించిన 18 టన్నుల బరువు గల ఈ మాడ్యూల్ చాలా పెద్దది.
ఇది ప్రయాణిస్తున్న మార్గాన్ని పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా గురువారం తెలిపింది.
అయితే, ఇప్పట్లో దానిని పేల్చివేసే ప్రణాళిక ఏమీ లేదని చెప్పింది.
ఇది ఆదివారం తెల్లవారుజామున కూలవచ్చని అంతరిక్ష వ్యర్థాల నిపుణులు భావిస్తున్నారు.
అయితే, ఈ అంచనాలు అన్నిసార్లూ కచ్చితంగా ఉండవు.
ఈ మాడ్యూల్‌ను భూమి ఉపరితలం నుంచి 160/375 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలిప్టికల్ కక్ష్యలోకి ఏప్రిల్ 29న పంపించారు.
కానీ, దీనిని పంపించినప్పటి నుంచి అది క్రమంగా దిగువకు వస్తోంది.
ఈ వెహికల్ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు చాలా వరకు భస్మమైపోతుంది.
ఒక్కోసారి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగే ఖనిజాలు, ఇతర పదార్థాలు భూవాతావరణంలోకి వచ్చిన తరువాత కూడా భస్మం కాకుండా ఉంటాయి.
ఆఫ్రికాలో నిరుడు ఇలాంటి రాకెట్ భాగం ఒకటి భూమిపై పడింది.
ప్రస్తుతం చైనా రాకెట్ భూమధ్య రేఖకు 41.5 డిగ్రీల వాలులో ప్రయాణిస్తోంది.
అంటే, దాని శకలాలాు భూమధ్య రేఖకు 41.5 డిగ్రీల ఉత్తరం వైపు గాని, దక్షిణం వైపు గాని కూలే అవకాశం లేదు.
ఈ రాకెట్ శకలాలు అంతర్జాతీయ జలాల్లో కూలడం వల్ల కలిగే హాని గురించి పశ్చిమ దేశాల మీడియా ఎక్కువ చేసి ప్రచారం చేస్తోందని చైనా మీడియా అంటోంది.
హాని జరిగితే తగిన చర్యలు తీసుకునేందుకు చైనా స్పేస్ మానిటరింగ్ నెట్ వర్క్ పర్యవేక్షిస్తున్నట్లు ఏరో స్పేస్ నిపుణులు సాంగ్ ఝాంగ్ పింగ్ చెప్పినట్లు ది గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
“అయితే, ఇదంతా చైనా నిర్లక్ష్య ధోరణిని తెలియచేస్తోంది” అని హార్వర్డ్ స్మిత్ సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్ అమెరికాకు చెందిన జోనాథన్ మాక్ డోవెల్ అన్నారు.
“ఈ రాకెట్ ప్రయోగం చేయడం ఇది రెండో సారి. గతంలో రాకెట్ ప్రయోగం జరిగినప్పుడు ఆ రాకెట్ శకలాలు ఐవరీకోస్ట్‌లో పడ్డాయి.
అది కూడా ఇప్పుడు ప్రయోగించిన రాకెట్‌ను పోలి ఉంటుంది,
“1979లో అమెరికా అంతరిక్ష కేంద్రం స్కై ల్యాబ్ శకలాలు పశ్చిమ ఆస్ట్రేలియాలో కూలాయి. ఆ తరువాత భారీ అంతరిక్ష వస్తువులను ఎలాంటి నియంత్రణ లేకుండా భూమి పైకి పడేలా వదిలేయడం ఐవరీ కోస్ట్ ఘటన, ప్రస్తుత ఘటనల్లోనే జరిగింది” అని ఆయన అన్నారు.
ఈ అంతరిక్ష వ్యర్ధాల బాధ్యత చాలా దేశాలపై ఉన్నప్పటికీ ప్రధాన బాధ్యత అమెరికా, రష్యాలపై ఉందని యూకేలోని సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీ స్పేస్ సైంటిస్ట్ హ్యూ లెవీస్ అన్నారు.
అయితే, ఆధునిక కాలంలో అంతరిక్ష మిషన్ పూర్తి కాగానే రాకెట్ దశలవారీగా కక్ష్యల నుంచి వైదొలిగేలా చేస్తున్నారు.
సాధారణంగా ఇవి ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దక్షిణ అమెరికాకు మధ్యలోనున్న సౌత్ పసిఫిక్ దగ్గర్లో ఉన్న సముద్రంలో పడిపోతాయి.
1500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం రాకెట్ వ్యర్థాలకు, పని చేయని శాటిలైట్లకు స్మశానంగా పేరు పొందింది.
ఇక్కడ సముద్రంలో సుమారు 260 అంతరిక్ష మిషన్ల వ్యర్థాలు కూలిపోయి ఉంటాయని భావిస్తున్నారు.