Homeహైదరాబాద్latest Newsబీజేపీలో అంతర్యుద్ధం.. అధ్యక్ష పీఠానికి తీవ్ర పోటీ.. ఈటలపై తీవ్ర వ్యతిరేకత

బీజేపీలో అంతర్యుద్ధం.. అధ్యక్ష పీఠానికి తీవ్ర పోటీ.. ఈటలపై తీవ్ర వ్యతిరేకత

  • ఈటల కు అధ్యక్ష పీఠం దక్కినట్టు జోరుగా ప్రచారం
  • సొంతపార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత
  • ఆలోచనలో పడ్డ అధిష్ఠానం
  • కోర్ బీజేపీ నుంచి ఈటలకు నో సపోర్ట్
  • తెరమీదకు డీకే అరుణ పేరు
  • అందరికీ ఆమోదయోగ్యురాలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీలో చిచ్చురేగింది. అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. గతంలో అయితే ఈ పోస్టుకు పెద్దగా విలువ ఉండేది కాదుజ బీజేపీ సీనియర్ లీడర్లలో ఎవరో ఒకరు అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఎనిమిది అసెంబ్లీ సీట్లు.. ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకొని బలంగా నిలబడింది. వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుపొంది అధికారపీఠం అధిరోహించాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు ఇప్పుడు ఈ పోస్టుకు ఇంత ప్రాధాన్యం ఏర్పడింది. బీజేపీలోని కీలక నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి కేంద్రమంత్రులుగా అవకాశం రావడంతో.. ఈటల ఈ పోస్ట్ మీద కన్నేశారు. ఓ దశలో అధిష్ఠానం కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈటల మీడియా మేనేజ్ మెంట్ తో తాను కాబోయే బీజేపీ స్టేట్​ చీఫ్​ నంటూ బిల్డప్ ఇచ్చుకున్నారు. దీంతో బీజేపీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈటల విషయంలో పార్టీలో ఇంత వ్యతిరేకత ఉందా? అన్న విషయం అప్పుడే హైకమాండ్​ కు తెలిసింది.

ఈటల మీద ఎందుకింత వ్యతిరేకత?
బీజేపీ అంటే కేవలం ఒక రాజకీయపార్టీ మాత్రమే కాదు. ఆ పార్టీకి అనేక అనుబంధ సంఘాలు ఉంటాయి. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ, భజరంగ్ దళ్, హిందూవాహిని లాంటి సంస్థల సమాహారమే బీజేపీ.. సహజంగా ఇటువంటి సంఘాల నుంచి బీజేపీలో జాయిన్ అయ్యేవాళ్లు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. కానీ ఈటల బీజేపీకి సైద్ధాంతికంగా పూర్తి విరుద్ధమైన వామపక్ష నేపథ్యం ఉన్న నేత. అందుకే ఆయన కాషాయపార్టీలో ఇమడలేకపోతున్నారు. ఇక కోర్​ బీజేపీ కార్యకర్తలు సైతం ఈటలను తమ లీడర్​ గా అంగీకరించలేకపోతున్నారు. ఈటల రాజేందర్ కూడా ఇష్టపూర్వకంగా బీజేపీలో చేరలేదు. అనేక పార్టీలతో సంప్రదింపులు జరిపారు. కొత్తగా ఓ రాజకీయపార్టీ పెట్టాలని భావించారు. ఓ దశలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ చివరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులకు భయపడి కాషాయగూటికి చేరుకున్నారు.

రాజాసింగ్ కు ఈటల కౌంటర్ బూమరాంగ్​
ఇటీవల రాష్ట్ర అధ్యక్ష పదవిపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. దేశం కోసం ధర్మం కోసం పోరాడేవాళ్లకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలి.. బయటి నుంచి వచ్చిన లీడర్లకు ఇవ్వొద్దు .. అంటూ కామెంట్ చేశారు. దీనికి ఈటల తాను గల్లీ లీడర్ ను కాదు.. స్టేట్​ లీడర్ ను అంటూ కౌంటర్ ఇచ్చుకున్నారు. ఈ కామెంట్లు బీజేపీ లీడర్లను నొచ్చుకునేలా చేశాయి. ఇక తెలంగాణ బీజేపీ సైతం రెండు వర్గాలుగా విడిపోయింది. సంప్రదాయ బీజేపీ వాదులు ఒకవైపు.. వలస బీజేపీ నేతలు ఒకవైపుకు ఉన్నారు. అయితే సంప్రదాయ బీజేపీ నేతల వల్ల ఆ పార్టీకి ఉపయోగం ఏమిటి? మేం పవర్​ లోకి వచ్చాకే కదా.. బీజేపీ బలపడింది అన్నది వలస బీజేపీ నేతల ఆర్గ్యూమెంట్. ఇక వలసనేతలు ఎప్పుడైనా పార్టీ మారొచ్చు.. అటువంటి లీడర్లకు అధ్యక్ష పదవి ఇస్తే తీవ్ర నష్టం అన్నది సంప్రదాయ వాదుల వాదన. మొత్తం ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్నది.

అరుణమ్మ పేరు తెరమీదకు..
ఈటల రాజేందర్ అభ్యర్థిత్వంపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మధ్యేమార్గంగా అరుణమ్మ పేరు తెరమీదకు వస్తున్నది. డీకే అరుణ ఉమ్మడి పాలమూరు జిల్లాను శాసించిన నేత. ఈటల కంటే రాజకీయ అనుభవం ఎక్కువగా ఉన్నది. పైగా మహిళా నేతకు పగ్గాలు ఇచ్చామన్న పేరు కూడా పార్టీకి వస్తుంది. ఇక ఆమె మంత్రిగా సుధీర్ఘకాలం పాటు పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా డీకే అరుణకు ఇమేజ్ ఉంది. అందుకే ఆమె పేరు తెరమీదకు తెస్తున్నారు. అయితే ఈటల రాజేందర్ మాత్రం బీసీ కార్డును నమ్ముకున్నారు. గతంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది కనక.. ఇప్పుడు అధ్యక్ష పీఠం తనకు కట్టబెట్టాలన్నది ఆయన డిమాండ్​. ఇక బీజేపీ అధిష్ఠానం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img