ఇదేనిజం, వరంగల్ ప్రతినిధి: సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ఖరారైంది. సీఎం హోదాలో ఆయన తొలిసారి సమ్మక్క సారలమ్మ జాతరకు రానున్నారు. సమ్మక్క- సారలమ్మ భక్తులు తెలంగాణ కుంభమేళగా పిలుచుకునే మేడారాన్ని సీఎం ఫిబ్రవరి 23న సందర్శించనున్నారు. శనివారం మేడారం సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం (వడ్డెల సంఘం) ఆధ్వర్యంలో పూజారులు హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెంట ఉన్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21 నుంచి సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వసతి సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా వర్తించనుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈసారి మేడారం జాతరకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మక్క సారలమ్మ పూజారులు మంత్రులతో కలిసి మేడారంలో మహా జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు. మేడారంలో జరుగుతున్న పనుల పురోగతిని తెలియజేశారు. మేడారంలో సమకూర్చాల్సిన వసతుల ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ జాతరలో పూజారుల సమస్యలు, పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై వినతి పత్రం అందజేశారు. మేడారం సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పోస్టరు, ఆహ్వాన ప్రతులను మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. నాలుగు రోజులపాటు వైభవంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా ఫిబ్రవరి 23న తాను మేడారం వస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు పూజారులు వెల్లడించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, ఉన్నతాధికారులు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.