Homeరాజకీయాలుమాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి..

మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి..

ఇదే నిజం, వెబ్ డెస్క్: తమ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో స్వేచ్ఛ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రులు పదే పదే చెబుతున్నారు. తాము ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చామని.. ఏడో గ్యారెంటీ కింద ప్రజాస్వామ్య పాలన అందజేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఇక ప్రగతి భవన్​ ను ప్రజాభవన్​ గా పేరు మార్చారు. సెక్రటేరియట్​ లోకి అందరికీ అనుమతి ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సెక్రటేరియట్​లోకి రిపోర్టర్లను రానిచ్చేవారు కాదని.. కానీ ప్రస్తుతం అందరికీ ఆహ్వానం ఉందని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని పలువురు రిపోర్టర్లు వాపోతున్నారు. కేవలం గత ప్రభుత్వ నాటి పరిస్థితే మళ్లీ రిపీట్​ అవుతోందని చెబుతున్నారు.

విజిటింగ్​ కార్డులతోనే వెళ్తున్న జర్నలిస్టులు
సాధారణంగా ప్రతి రోజు సామాన్య ప్రజలను విజిటింగ్​ కార్డులు చూపిస్తే సెక్రటేరియట్​ లోకి పంపిస్తుంటారు. ప్రస్తుతం జర్నలిస్టులు కూడా ఆ కార్డులు పట్టుకొని వార్తా సేకరణకు వెళ్తున్నారు. కొంతమంది రిపోర్టర్లు తమ వ్యక్తిగత పరిచయాలతో మాత్రమే లోపలికి వెళ్లగలుగుతున్నారు. ఇక సెక్రటేరియట్​ వెలుపల ఏర్పాటు చేసిన మీడియా సెంటర్​ సైతం నామ్​ కే వాస్తేలాగా మారిపోయింది. దీంతో జర్నలిస్టులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛ లేదని తాము ఎంతో బాధపడ్డామని.. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు దీరినా ఇదే పరిస్థితి కనిపిస్తోందని వారు అంటున్నారు.

వాస్తవాలు బయటకు రావడం ఎలా?
ఇక వివిధ శాఖల్లో ఏం జరుగుతోంది? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి. వంటి విషయాలు తెలుసుకోవాలంటే .. జర్నలిస్టులు సెక్రటేరియట్​ లోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎంట్రీ లేదు. దీంతో సేమ్​ గత ప్రభుత్వం నాటి పరిస్థితే కనిపిస్తోంది. కాంగ్రెస్​ ప్రభుత్వంలోనైనా తమకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుందని జర్నలిస్టులు భావించారు. కానీ ఈ ప్రభుత్వంలోనూ స్వేచ్ఛ లేకపోవడంతో వారు వాపోతున్నారు.

సీఎం దృష్టికి వెళ్లిందా?
మరి ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లిందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో, సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులది కీ రోల్​. కానీ వారినే సచివాలయంలోకి రానివ్వకపోవడంతో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img