ఇదేనిజం, తెలంగాణ : ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “విద్యార్థుల ప్రాణత్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. పేదలకు ఉద్యోగాలు ఇచ్చి, యువతను ప్రయోజకులుగా చేసే ప్రభుత్వం ఇది. ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో యువతదే కీలకపాత్ర. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆశలు నెరవేరలేదు. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. టీఎస్పీఎక్సీ లో ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,004 మంది స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలు అందజేశారు..
BRS ప్రభుత్వం వాళ్ల కుటుంబం గురించి మాత్రమే ఆలోచించింది. తెలంగాణ కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టి వేధించింది. కవితను ప్రజలు ఓడిస్తే వెంటనే కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి, ఉద్యోగాల గురించి కేసీఆర్ ఎన్నడూ ఆలోచించలేదు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. టీఎస్పీఎక్సీ లో భాగంగా కొత్త చైర్మన్ సభ్యులను నియమించాం. ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం” అని సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ప, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.