Homeహైదరాబాద్latest Newsజూన్ లోనే ‘లోకల్ ఫైట్’.. వ్యతిరేకత రాకముందే ముగించాలని కాంగ్రెస్ ప్లాన్

జూన్ లోనే ‘లోకల్ ఫైట్’.. వ్యతిరేకత రాకముందే ముగించాలని కాంగ్రెస్ ప్లాన్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మీద గ్రామగ్రామాన చర్చ జరుగుతోంది. ఒక్క ఫ్రీ బస్సు స్కీమ్ మినహా ఏ పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఈ అంశం పల్లెపల్లెకు పాకింది. అసెంబ్లీ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ కి ఉన్న అనుకూలత .. ఎంపీ ఎన్నికల నాటికి తగ్గింది.. అందుకే వీలైనంత త్వరగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. జూన్ నెలలోనే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్ల అంశం అడ్డంకిగా మారబోతున్నదన్న చర్చ జరుగుతోంది. అయితే గతంలో 2019 నాటి రిజర్వేషన్ల విధానాన్నే ఈ దఫా కూడా కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోందట. ప్రభుత్వ వ్యతిరేకత పెరగకముందే లోకల్ బాడీ ఎన్నికలు జరుపుకొని గౌరవప్రదమైన సీట్లు, ఓట్లు సాధించాలని కాంగ్రెస్ సర్కారు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. జూన్ 4న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ ముగియనున్నది. ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. జనవరితోనే స్థానిక సంస్థల పదవీకాలం ముగిసినప్పటికీ ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది.

బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని..
పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. స్థానిక సంస్థల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ పార్టీనే భావిస్తోంది. అందుకే ఓటమి భారంతో కుంగిపోయిన బీఆర్ఎస్ పల్లెటూర్లలో పుంజుకోకముందే ఎన్నిక నిర్వహిస్తే బలీయమైన శక్తిగా ఎదగొచ్చని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చోటా మోటా లీడర్లు.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చాలా చోట్ల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం హస్తం గూటికి చేరుకున్నారు. నయానో భయానో వారిని తమ వైపుకు తిప్పుకున్నారు కాంగ్రెస్ లీడర్లు.. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకోకముందే ఎన్నికలు నిర్వహిస్తే పల్లెల్లో బలపడొచ్చని కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది.

పల్లెల్లో ఎన్నికల సందడి
ఇక గ్రామగ్రామాన అప్పుడే ఎన్నికల సందడి కూడా మొదలైంది. ఆత్మీయ సమ్మేళనాలు, దావత్ లతో పల్లెలు కళకళలాడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు పరోక్ష సంకేతాలు ఇచ్చేశారు. దీంతో లోకల్ లీడర్లు ఎన్నికల బిజీలో పడిపోయారు. ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అందుకే నేరుగా ఎమ్మెల్యేలు సైతం ఇన్ వాల్వ్ అవుతున్నారు. మరి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతమేరకు సత్తా చాటుతుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img