Consumer Forum Shock to Hyderabad International Airport : దిశమారిన ఎస్కలేటర్.. ప్రయాణికుడికి రూ.5లక్షల పరిహారం..
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Hyderabad International Airport) పేరొందిన ప్రముఖ జీఎంఆర్ సంస్థ (GMR) నిర్వహిస్తోంది.
నిత్యం 10 వేల నుంచి 30 వేల మంది వరకు ప్రయాణికులు ఈ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.
దేశంలోనే అత్యాధునిక ఎయిర్ పోర్టుగా పేరున్న ఈ విమానాశ్రయంలో సౌకర్యాలు అదేస్థాయిలో ఉంటాయని అందరూ అనుకుంటారు.
కానీ జీఎంఆర్ హైదరాబాద్ (Hyderabad) ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనపడుతున్నాయి.
సరైన సౌకర్యాలు లేకుండా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు.
తాజాగా ఓ వ్యక్తి ఎస్కలేటర్లో లోపం తలెత్తడం వల్ల ప్రమాదానికి గురయ్యాడు.
తన కాళ్ళకు తీవ్ర గాయాలు కావడంతో తెలంగాణ (Telangana) రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కరణ కమిటీకి (టీఎస్ఆర్సిడిసి) పిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగు చూసింది.
ప్రతి రోజు లాగానే ప్రయాణికులందరూ ఆంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు.
ఐతే సుబ్రోటో బెనర్జీ అనే ప్రయాణికుడు ఎయిర్ పోర్టులోని ఎస్కలేటర్ ఎక్కారు.
వెంటనే ఆయన ఎస్కలేటర్ నుంచి ఒక్కసారి జారి కిందపడ్డాడు.
దీంతో ఆయన కాళ్ళకు బలమైన గాయాలయ్యాయి. జీహెచ్ఐఏఎల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షలుచేసిన వైద్యులు కాళ్లల్లో పలుచోట్ల ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు.
దీంతో ఆయన ఎయిర్ పోర్టులో సమస్యలు, తనకు జరిగిన నష్టంపై జీఎంఆర్ సంస్థపై టీఎస్ఆర్సిడిసికి పిర్యాదు చేశాడు.
ఓ దిశగా వెళ్తున్న ఎస్కలేటర్ హఠాత్తుగా మరో దిశకు మారడంతో ఈ ప్రమాదం జరిగిందని బెనర్జీ ఆరోపించారు.
ఎయిర్ పోర్టులో లోపాలతో కూడిన ఎస్కేలేటర్ వల్లే తాను ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చిందని ఫిర్యాదులే పేర్కొన్నారు.
జీహెచ్ఐఏఎల్ తనకు 50 లక్షల పరిహారం చెల్లించేలా చేయాలని టీఎస్ఆర్సిడిసిని కోరాడు.
దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కరణ కమిటీ దీనిపై దర్యాప్తు చేపట్టింది.
విమానాశ్రయంలో తీవ్ర గాయాలు అయినా బెనెర్జీకి 5 లక్షలు పరిహారం చెల్లించాలని జీహెచ్ఐఏఎల్ ను ఆదేశించింది.
ఈ పరిహారాన్ని 30 రోజులలోపు చెల్లించాలని కమిటీ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ 30 రోజుల లోపు పరిహారం చెల్లించకపోతే 9శాతం వడ్డీతో కలిపి ఇతర ఖర్చులకు అదనంరా రూ.10వేలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఐతే బెనర్జీ చేసిన ఆరోపణలుపై జీఎంఆర్ ఎయిర్ పోర్టు అధికారులు తోసిపుచ్చారు.
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కావడంతో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని.. ఎక్కడా పొరబాటు జరిగే అవకాశం లేదని వాదించారు.
ఇది కేవలం ప్రమాదమేనని.. సదరు ప్యాసెంజర్ రెయిలింగ్ ను సరిగా పట్టుకోలేదని ఆరోపించారు.
ఆలాగే ప్రమాదం జరిగిన వెంటనే ఎలివేటర్ నిలిపివేయడంతో పాటు ఆతడ్ని ఆస్పత్రికి తరలించామన్నారు.
అంతేకాకుండా వైద్యానికి రూ.1,51,468 ఖర్చు చేసినట్లు వివరించారు.
ఐతే ఎయిర్ పోర్టు అధికారులు చెప్పిన అంశాలకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో వినియోగదారుల ఫోరం పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.