Homeహైదరాబాద్latest Newsతెల్లారి లేస్తే బూతులు తిట్టడం.. వెకిలి ప‌నులు చేయడం తీన్మార్ మల్లన్న లక్షణం: కేటీఆర్

తెల్లారి లేస్తే బూతులు తిట్టడం.. వెకిలి ప‌నులు చేయడం తీన్మార్ మల్లన్న లక్షణం: కేటీఆర్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే వ్యక్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 56 క్రిమినల్ కేసులున్న వ్యక్తికి కాంగ్రెస్ పట్టభద్రులు ఎమ్మెల్సీలో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చిందని ఆయన మండిడ్డారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం నర్సంపేట, వరంగల్​ ఈస్ట్​లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్​ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశాల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో 5 గంటల పాటు కరెంట్ పోతే ఒక్క జ‌న‌రేట‌ర్ కూడా ప‌నిచేయ‌లేదు. మ‌రి న‌వ‌జాత శిశువుల ప‌రిస్థితి, ఐసీయూలో ఉన్న పేషెంట్ల ప‌రిస్థితి ఏంటి? ఇదేనా కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు? రూ.2 లక్షల రుణమాఫీ కాలేదు. రైతుబంధు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. వరికి రూ. 500 బోనస్ దక్కలేదు. రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే… పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేశ్ రెడ్డిని గెలిపించాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

రాకేశ్​ రెడ్డి.. గోల్డ్ మెడలిస్ట్
బీఆర్ఎస్ త‌ర‌పున‌ రాకేశ్ రెడ్డికి కేసీఆర్ అవ‌కాశం ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. ‘రాకేశ్ రెడ్డి సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. వ‌ర్ధ‌న్నపేట నియోజ‌క‌వ‌ర్గంలో వంగ‌ప‌హాడ్‌లో జ‌న్మించారు. బిట్స్ పిలానీలో చ‌దివి గోల్డ్ మెడ‌ల్ సాధించారు. అమెరికాలో ల‌క్ష‌ల జీతం వ‌దిలేసుకుని పుట్టిన గ‌డ్డ‌కు సేవ చేయాల‌ని సొంతూరికి చేరుకున్నారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌జాసేవ చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో మీరు రైతు బిడ్డ‌లుగా, విద్యావంతులుగా మోసాన్ని గ్ర‌హించి ఓటేయ‌క‌పోతే న‌ష్ట‌పోయేది మీరే. నోటిఫికేష‌న్లు ఇవ్వ‌క‌పోయినా ప‌ట్ట‌భ‌ద్రులు ఓటేశారు అని ప్ర‌భుత్వం అనుకుంటుంది. జాబ్ క్యాలెండ‌ర్, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి ఇవ్వ‌క‌పోయినా మాకు ఓటేశారు అనుకుంటారు. ఒక్క ప‌రీక్షకు కూడా ఫీజు ఉండ‌ద‌న్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు టెట్ ఫీజు రూ. 400 ఉండే. ఇప్పుడు రూ. 2 వేలు అయింది. మ‌ళ్లీ వాళ్ల‌కు ఓటేస్తే టెట్ ఫీజు రూ. 20 వేలు చేయ‌రా? ఆలోచించండి’ అని కేటీఆర్ తెలిపారు.

ఆయన లక్షణాలు ఇవే..
తెల్లారి లేస్తే బూతులు తిట్టడం, వెకిలి ప‌నులు చేయడం కాంగ్రెస్ అభ్యర్థి లక్షణాలని కేటీఆర్ మండిపడ్డారు. దందాలు చేయ‌డం, బెదిరించ‌డం వంటి కేసులు న‌మోదైన‌ట్లు కాంగ్రెస్ అభ్య‌ర్థి అఫిడ‌విట్‌లో ఉన్నాయన్నారు. ‘ ఆడ‌పిల్ల‌ల ఫొటోలు మార్ఫింగ్ చేయడం, అనుమ‌తి లేకుండా అమ్మాయిల‌ ఫోన్ నంబ‌ర్ల‌ను ఫేస్‌బుక్‌లో పెట్టడం, బ్లాక్ మెయిల్ చేసిన కేసులు.. ఇలా 56 క్రిమిన‌ల్ కేసులు ఉన్న మ‌హానుభావుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాబ‌ట్టి అభ్య‌ర్థుల గుణ‌గ‌ణాలు చూడాలి. తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక అవుతాయి. మండ‌లిలో వైట్ కాల‌ర్ వ‌ర్క‌ర్ ఉండాల్నా.. బ్లాక్ మెయిల‌ర్ ఉండాల్నా అనేది ఆలోచించండి. ఈ ఒక్క సీటుతో గ‌వ‌ర్న‌మెంట్ రాదు.. పోదు. కానీ బీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలిస్తే న‌ర్సంపేట యువ‌త త‌ర‌పున రేపు మండ‌లిలో గ‌ల్లా ప‌ట్టి అడిగే ప‌రిస్థితి ఉంటుంది. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు, నోటిఫికేష‌న్లు ఎక్క‌డా అని అడిగే హ‌క్కు ఉంటుంది. నిరుద్యోగ భృతి ఎక్కడా అని ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే వాయిస్ ఉంటుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

కంపెనీలను తెచ్చే సత్తా లేదు
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే స్థాయి ఆ పార్టీ నేతలకు లేదన్నారు. ‘ కాంగ్రెస్ నాయకులకు రాష్ట్రంలో ఉన్న కంపెనీలను కాపాడుకునే సత్తా లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీ మారుతారు. ఆయనకు అనుకూలంగా ఉండే బీజేపీలోకి వెళ్తారు. విద్యావంతుల పక్షాన కొట్లాడే వారిని పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించాలి. తీన్మార్ మల్లన్న లాంటి వారికి ఓటుతో ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Recent

- Advertisment -spot_img