ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటూ ప్రజాస్వామిక వాదులు సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు. కాగా తాజాగా ఈ కామెంట్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. దానం నాగేందర్ .. అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ లో తిరగనివ్వను అంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికలకు పాడి కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. దేశంలో 2లక్షల 2 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివరించారు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆయన తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన 30వేల ఉద్యోగాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగ ఖాళీల వివరాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్‌పై ఎవరి సంతకం లేదని పేర్కొన్నారు. తేదీలు, ఉద్యోగ ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. దానం నాగేందర్ కు ముఖ్యమంత్రి మైక్ ఇప్పించి మరీ తమను తిట్టించారని ఫైర్ అయ్యారు.