– హస్తం పార్టీపై మంత్రి హరీశ్ రావు సెటైర్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ హయాంలో గ్రామానికో ఒకరిద్దరు ఆదర్శ రైతులుండేవారని.. కేసీఆర్ పాలనలో ఊరంతా ఆదర్శ రైతులేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం జహీరాబాద్ హద్నురులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కర్నాటకలో ఐదు గ్యారెంటీలు ఇచ్చి ఐదు నెలలైందని.. ఎందుకు నెరవేర్చలేదని రాహుల్ గాంధీని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయానికి ఐదుగంటలే కరెంట్ వస్తుందని.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోలేక జనం ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. కటక వేస్తే వచ్చే కరెంట్ కావాలో.. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కర్ణాటకలో పెన్షన్ రూ.600 ఇస్తున్నారని.. కల్యాణలక్ష్మి అక్కడ అమల్లో లేదన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదని.. గెలవని తెలంగాణలో హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఎకరాకు రూ.16వేల రైతుబంధును గెలిచాక ఇవ్వబోతున్నామన్నారు. కాంగ్రెస్‌కు ఓటేయొద్దని కర్ణాటక ప్రజలు లబోదిబోమంటున్నారన్నారు. అక్కడ కాంగ్రెస్ వస్తే ఐదుగంటల కరెంట్ ఇస్తుందన్న ఆయన.. రైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారిందన్నారు. ఐదుగంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటువేయాలని.. 24 గంటలు కావాలంటే బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలన్నారు. ఎన్నికల్లో గెలవగానే సన్నబియ్యం ఇవ్వబోతున్నామని.. జనవరి నెల నుంచి అసైన్డ్ భూములకు పట్టా ఇచ్చి హక్కులు కల్పిస్తామని చెప్పారు. జహీరాబాద్‌కు కాంగ్రెస్ పాపంగా మారిందని.. 12సార్లు గెలిచినా చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటే.. నేడు పోదాం పద సర్కారు దవాఖానకు అని అంటున్నారన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.