Homeఅంతర్జాతీయంFacebook facial recognition : ఫేసియల్ రికగ్నిషన్ సిస్టం'ను మూసేయనున్న ఫేస్‌బుక్.. ఈ ఫీచ‌ర్‌ను తీసేస్తే...

Facebook facial recognition : ఫేసియల్ రికగ్నిషన్ సిస్టం’ను మూసేయనున్న ఫేస్‌బుక్.. ఈ ఫీచ‌ర్‌ను తీసేస్తే లాభమా? న‌ష్ట‌మా?

facebook removing facial recognition system : ఫేసియల్ రికగ్నిషన్ సిస్టం’ను మూసేయనున్న ఫేస్‌బుక్.. ఈ ఫీచ‌ర్‌ను తీసేస్తే లాభమా? న‌ష్ట‌మా?

వ్య‌క్తిగ‌త గోప్య‌త‌పై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

ఫొటోల్లోని ముఖాలు, వీడియోల‌ను గుర్తుప‌ట్టేందుకు వీలుగా ఉన్న ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్ సాఫ్ట్‌వేర్‌ను ఇక‌పై ఉప‌యోగించ‌బోమ‌ని ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తెలిపింది.

సామాజిక ఆందోళ‌నలు, రెగ్యులేట‌రీ కార‌ణాల వ‌ల్ల ఫేస్ స్కాన్ డేటాను పూర్తిగా డిలీట్ చేస్తున్నామ‌ని వెల్ల‌డించింది.

ఫేస్‌బుక్ ఈ నిర్ణ‌యంతో దాదాపు 100 కోట్ల మంది యూజ‌ర్లు ప్ర‌భావితం కానున్నారు.

ఈ క్ర‌మంలో అస‌లు ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్ అంటే ఏంటి? ఆ ఫీచ‌ర్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది? ఉన్న‌ట్టుండి ఈ ఫీచ‌ర్‌ను తీసేస్తే లాభమా? న‌ష్ట‌మా? ఒక‌సారి చూద్దాం..

ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది?

2010లో ఫేస్‌బుక్ ఈ ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్‌ను తీసుకొచ్చింది.

ఇది యాక్టివేట్ చేసుకుంటే మ‌న ఫొటోల‌ను, ముఖ క‌వ‌ళిక‌ల‌ను ఈ టెక్నాల‌జీ స్కాన్ చేస్తుంది.

అలా స్కాన్ చేసిన మ‌న ఫొటోను ఫేస్‌బుక్ డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటుంది.

మ‌నం ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఫొటోలు లేదా వీడియోల్లోని వ్య‌క్తుల‌ను గుర్తించి, వారిని ట్యాగ్ చేసే స‌దుపాయం కూడా ఈ ఫీచ‌ర్‌లో భాగ‌మే.

ఈ ఫీచ‌ర్ యాక్టివేట్ చేసుకున్న త‌ర్వాత ఫేస్‌బుక్ ఫ్లాట్‌ఫాంపై ఎవ‌రు మ‌న ఫొటోను లేదా వీడియోను పోస్టు చేసినా ముందుగా మ‌న‌కు ఒక నోటిఫికేష‌న్ వ‌స్తుంది.

అప్పుడు దానికి మ‌నం అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది.

కాబ‌ట్టి మ‌న‌కు తెలియ‌కుండా ఎవ‌రు ఫేస్‌బుక్‌లో మ‌న ఫొటో లేదా వీడియోను ఉప‌యోగించ‌డానికి అవ‌కాశం ఉండ‌దు.

కాబ‌ట్టి ఈ ఫీచ‌ర్ వ‌ల్ల మ‌న‌ ఫొటోలు మిస్ యూజ్‌కు ఆస్కారం ఉండ‌ద‌ని ఫేస్‌బుక్ భావించింది.

ఈ స‌దుపాయం బాగుండ‌టంతో ఇది తొంద‌ర‌గా యూజ‌ర్ల‌కు చేరువైంది.

ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌లో దాదాపు మూడొంతుల మంది ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్‌ను వాడుతున్నారు.

ఈ ఫీచ‌ర్‌తో వ‌చ్చిన స‌మ‌స్యేంటి?

మీ కొలిగ్ ఒక‌రు ఆఫీసులో దిగిన ఒక గ్రూప్‌ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడ‌ని అనుకుందాం.

అప్పుడు ఫేస్ రికగ్నిష‌న్‌కు సంబంధించిన‌ ట్యాగ్ స‌జేష‌న్ ద్వారా మీ ఫొటోపై మీ పేరును యాడ్ చేశాడ‌ని అనుకుందాం.. అప్పుడు ఎవ‌రైతే ఫొటో షేర్ చేశారో.. అత‌ని ఫేస్‌బుక్ స్నేహితులంద‌రికీ మీరు ఎవ‌రు అనేది తెలిసిపోతుంది.

అంటే మ‌న‌కు తెలియ‌ని వ్య‌క్తుల‌కు కూడా మ‌న‌మెవ‌రో తెలిసిపోతుంది.

దీంతో ప్రైవ‌సీకి భంగం క‌లుగుతుంద‌ని.. ఆక‌తాయిల నుంచి వేధింపుల‌కు గుర‌య్యే అవ‌కాశాలు పెరుగుతాయ‌ని ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇది కాకుండా ప‌లు దేశాల ప్ర‌జ‌ల ముఖ క‌వ‌ళిక‌లు గుర్తించ‌డంలో ఫేస్‌బుక్ రిక‌గ్నిష‌న్ అల్గారిథ‌మ్ సరిగ్గా ప‌నిచేయ‌ట్లేద‌ని 2019లో అమెరికా ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ఒక అధ్య‌య‌నంలో తేలింది.

యూర‌ప్ దేశాల‌తో పోలిస్తే ఆఫ్రిక‌న్‌-అమెరిక‌న్‌, ఆసియా దేశాల ముఖాల‌ను అంత క‌చ్చితంగా గుర్తించ‌డం లేద‌ని పేర్కొంది.

చుట్టుముట్టిన ఆరోప‌ణ‌లు.. వివాదాలు

ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్ టెక్నాల‌జీ మొత్తం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మీద ఆధార‌ప‌డి ప‌నిచేస్తుంది.

దీనివ‌ల్ల అస్థిరత్వానికి తెర‌తీసిందనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ టెక్నాల‌జీ కోసం ప్రైవ‌సీ నిబంధ‌న‌ల విష‌యంలో రాజీ ప‌డుతుంద‌ని విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి.

వ్య‌క్తిగ‌త గోప్య‌త విష‌యంలో ఫేస్‌బుక్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు వెల్లువెత్తాయి.

వ్య‌క్తిగ‌త గోప్య‌తపై ప‌లు దేశాల్లో ఫేస్‌బుక్‌కు వ్య‌తిరేకంగా ప‌లు కేసులు కూడా న‌మోద‌య్యాయి.

వాటిల్లో ఇల్లినాయిస్‌లో 2015లో న‌మోదైన కేసు కూడా ఒక‌టి. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ కేసు సాగింది.

చివ‌ర‌కు 2019లో 550 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించి ఫేస్‌బుక్ రాజీ కుదుర్చుకుంది.

ఇలా వ్య‌క్తిగ‌త డేటా చౌర్యంపై ప‌లు దేశాల నుంచి ఆరోప‌ణ‌లు, న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఎదుర్కొంటున్న స‌మ‌యంలోనే.. ఇటీవ‌ల‌ ఫేస్‌బుక్ డాక్యుమెంట్ల‌ను ఫ్రాన్సెస్ హ్యుజెన్ లీక్ చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్ విష‌యంలో ఇలాంటి వ‌రుస వివాదాలు చుట్టుముట్ట‌డంతో ఈ టెక్నాల‌జీ ఉప‌యోగాన్ని అమెజాన్‌, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్నాల‌జీ దిగ్గజాలు ఇప్ప‌టికే నిలిపివేశాయి.

తాజాగా ఫేస్‌బుక్ కూడా ఈ టెక్నాల‌జీ వినియోగాన్ని నిలిపివేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

ఈ ఫీచ‌ర్ తీసేస్తే న‌ష్ట‌మేంటి?

☞ ఈ ఫేసియ‌ల్ రికగ్నిష‌న్ ఫీచ‌ర్‌ను తీసేయ‌డం వ‌ల్ల ఈ ఫీచ‌ర్ ఉప‌యోగిస్తున్న‌ దాదాపు 100 కోట్ల మంది యూజ‌ర్లు ప్ర‌భావితం కానున్నారు.

ముఖ్యంగా అంధులకు ఉప‌యోగ‌ప‌డే ఆటోమేటిక్ ఆల్ట్ టెక్ట్స్ ప‌నిచేయ‌కుండా పోతుంది.

☞ అదికాకుండా ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు ఐడెంటిఫై చేసిన కోట్లాది మంది యూజ‌ర్ల ఫొటోలు, వీడియోల టెంప్లేట్స్‌ ఇక‌పై క‌నిపించ‌వు.

వాటిని తొల‌గింపును ద‌శ‌ల‌వారీగా చేస్తామ‌ని ఫేస్‌బుక్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటీ తెలిపారు.

☞ ఇక‌పై ఫేస్‌బుక్‌లోని ఫొటోలు, వీడియోల్లోని వ్య‌క్తుల ముఖాల‌ను ఫేస్‌బుక్ దానంత‌ట అది గుర్తించ‌దు.

ఫొటోల్లోని వ్య‌క్తుల‌ను సూచించ‌డానికి, వారి పేరుతో ట్యాగ్ చేయ‌డానికి కుద‌ర‌దు.

Recent

- Advertisment -spot_img