– విమానాల రాకపోకలను నిలిపివేసి ఎయిర్ పోర్టు అధికారులు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: లండన్ లోని లూటన్ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఎయిర్‌పోర్టు పరిధిలో ఉన్న కార్ పార్కింగ్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో దాదాపు 1,200 వాహనాలు నిలిచి ఉన్నాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో సమీప ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించింది. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని లూటాన్ ఎయిర్‌పోర్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది. పొగ పీల్చి అస్వస్థతకు గురైన కొందరు సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పార్కింగ్ భవనం దెబ్బతింది. ఈ ప్రమాదం కారణంగా ప్రయాణికులు, సిబ్బంది భద్రత మేరకు బుధవారం విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, మంటలు చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఫ్లైట్లను నిలిపివేయడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.