Homeఅంతర్జాతీయంఅమెరికాలోనే H-1B వీసా రెన్యువల్

అమెరికాలోనే H-1B వీసా రెన్యువల్

– కీలక నిర్ణయం తీసుకున్న యూఎస్ ప్రభుత్వం
– పైలట్ ప్రాజెక్ట్​ కింద 20 వేల మందికి రెన్యువల్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: హెచ్‌-1బీ వీసా రెన్యువల్ విధానాన్ని మరింత ఈజీ చేసేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీల హెచ్‌-1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్‌ చేసుకునేలా ఓ పైలట్‌ ప్రోగ్రామ్‌ను డిసెంబర్​లో ప్రారంభించనుంది. 3 నెలల పాటు ఈ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంటుందని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జూలీ స్టఫ్‌ వెల్లడించారు. తొలుత 20వేల మందికి ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద వీసా రెన్యువల్‌ చేయనున్నారు.‘భారత్‌లో అమెరికా వీసాలకు డిమాండ్‌ ఎక్కువ. భారతీయ ప్రయాణికులకు వీలైనంత త్వరగా వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అందులో ఒకటి దేశీయ వీసా రెన్యువల్‌ ప్రోగ్రామ్‌. ప్రస్తుతానికి దీన్ని పైలట్‌గా ప్రారంభించనున్నాం. డిసెంబరు నుంచి 3 నెలల పాటు అమెరికాలో ఉంటున్న హెచ్‌-1బీ వీసాదారులు.. వారి స్వదేశాలకు వెళ్లకుండానే వీసాలను రెన్యువల్‌ చేసుకోవచ్చు. పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద తొలుత 20వేల మందికి వీసాలను ఇక్కడే రెన్యువల్ చేస్తం. ఇందులో మెజార్టీ భాగం భారతీయులే ఉంటారు. క్రమక్రమంగా ఈ ప్రోగ్రామ్‌ను విస్తరిస్తాం’ అని జూలీ వెల్లడించారు. ఈ ప్రోగ్రామ్‌తో భారతీయులే అధిక ప్రయోజనం పొందుతారని తాము నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. ‘ఈ సదుపాయంతో భారతీయులు వీసా అపాయింట్‌మెంట్‌ కోసం వారి దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేగాక, భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాలు కూడా కొత్త దరఖాస్తులపై దృష్టిపెట్టొచ్చు’అని జూలీ పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక నోటీసులు జారీ చేస్తామని, ఈ వీసా రెన్యువల్‌కు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అన్న వివరాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్‌ను కేవలం హెచ్‌-1బీ కేటగిరీ వర్క్‌ వీసాలకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు.


భారతీయులే ఎక్కువ..


అమెరికా కంపెనీలు విదేశీ ఎక్స్​పర్ట్స్​ను నియమించుకునేందుకు హెచ్‌-1బీ వీసా అవకాశం కల్పిస్తాయి. ఈ వీసాలను వినియోగిస్తున్న వారిలో భారతీయులే అధికం. గతంలో హెచ్‌-1బీ వీసా కలిగిన వారు తమ వీసా రెన్యువల్ లేదా స్టాంపింగ్‌ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. 2004 వరకు ఇదే విధానం అమలయ్యేది. ఆ తర్వాత ఈ విధానంలో మార్పు చేశారు. హెచ్‌-1బీ వీసా కలిగిన వారు రెన్యువల్‌ కోసం తమ సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి యూఎస్‌ కాన్సులేట్‌ ఆఫీసుల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, కొన్ని సార్లు ఈ స్టాంపింగ్‌ కోసం వీసా అపాయింట్‌మెంట్‌కు నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ క్రమంలోనే అలాంటి వారికి ప్రయోజనం చేకూర్చేలా ఈ డొమెస్టిక్‌ వర్క్‌ వీసా రెన్యువల్‌ ప్రోగ్రామ్‌ను అమెరికా అందుబాటులోకి తీసుకొస్తోంది.


గతేడాది రికార్డ్​ స్థాయిలో వీసాల జారీ


ఇదిలా ఉండగా.. అమెరికాలో ఉన్నత విద్యకోసం వెళ్లేవారిలో భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది రికార్డు స్థాయిలో లక్షా 40 వేలకు పైగా మందికి అమెరికా విద్యార్థి వీసాలు జారీ చేసినట్లు జూలీ వెల్లడించారు. ఈ ఏడాదిలో ఈ సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలిపారు. ఇక, భారతీయులకు వీసా అపాయింట్‌మెంట్‌ వెయిటింగ్‌ సమయాన్ని కూడా తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img