Homeక్రైం50 మంది బందీల విడుదలకు హమాస్​ ఒకే

50 మంది బందీల విడుదలకు హమాస్​ ఒకే

– ఇజ్రాయెల్​తో కుదిరిన ఒప్పందం
– 4 రోజుల పాటు గాజాలో కాల్పుల విరమణను పాటించనున్న ఐడీఎఫ్​
– ఇదే సరైన నిర్ణయమన్ననెతన్యాహు
– ఫలించిన అంతర్జాతీయ సమాజం ప్రయత్నాలు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఆరు వారాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బందీల విడుదల కోసం ఇరువర్గాలు మధ్య కాల్పుల విరమణ పాటించేందుకు కొంతకాలంగా అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 50 మంది బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన సమావేశంలో ఇజ్రాయెల్‌ మంత్రివర్గం ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ‘కష్టమైనదే.. కానీ ఇది సరైన నిర్ణయమే’అని మంత్రులతో తెలిపారు. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌ నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించనుంది. ఆ సమయంలో గాజాలో సైనిక దాడులను నిలిపివేయనున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఆఫీసు వెల్లడించింది. అదే సమయంలో హమాస్‌ తమ వద్ద బందీలుగా ఉన్న 240 మందిలో నుంచి కనీసం 50 మందిని విడిచిపెట్టాల్సి ఉంటుందని తెలిపింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులను హమాస్‌ వదిలేయనున్నట్లు పేర్కొంది. ‘బందీలను సురక్షితంగా ఇంటికి తీసుకురావడమే మా లక్ష్యం. ఇందుకోసం తాత్కాలిక కాల్పుల విరమణ చేపట్టేందుకు హమాస్‌తో ఒప్పందానికి ప్రభుత్వం అంగీకరించింది’అని ఇజ్రాయెల్‌ ప్రధాని ఆఫీసు తమ ప్రకటనలో వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా తమ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్‌ విడిచిపెట్టనుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. తాజా ప్రకటనలో నెతన్యాహు సర్కారు మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు.


ఖతార్​ ప్రకటనలో పాలస్తీనా ఖైదీల ప్రస్తావన


అయితే, ఖతార్‌ చేసిన ప్రకటనలో మాత్రం పాలస్తీనా ఖైదీల విడుదల గురించి పేర్కొనడం గమనార్హం. ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య ఒప్పందం ఖరారైనట్లు ఖతార్‌ విదేశాంగ శాఖ బుధవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఈజిప్ట్​, అమెరికా, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య ఈ డీల్‌ కుదిరింది. కాల్పుల విరమణ ఎప్పుడు మొదలవుతుందన్న దానిపై వచ్చే 24 గంటల్లో ప్రకటన వెలువడుతుంది. అప్పటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఒప్పందంలో భాగంగా హమాస్‌ తమ వద్ద బందీలుగా ఉన్నవారిలో 50 మంది మహిళలు, చిన్నారులను విడిచిపెడుతుంది. అటు ఇజ్రాయెల్‌ కూడా తమ వద్ద జైళ్లలో ఉన్న పాలస్తీనా మహిళలు, చిన్నారులను విడుదల చేస్తుంది’ అని ఖతార్‌ తమ ప్రకటనలో పేర్కొంది. కాల్పుల విరమణతో గాజాకు మరింత మానవతా సాయం అందించేందుకు వీలు లభిస్తుందని ఖతార్‌ తెలిపింది.

Recent

- Advertisment -spot_img