Homeజిల్లా వార్తలుబదిలీలపై ‘హస్తం’ మార్క్‌?

బదిలీలపై ‘హస్తం’ మార్క్‌?

– గద్వాల జిల్లాలో మొదలైన పైరవీల పర్వం
– కాంగ్రెస్‌ నేతల కనుసన్నల్లోనే .. ఇసుక దందాలు ఉండేలా ప్లాన్‌?
– ఆసక్తిగా మారిన నడిగడ్డ పాలిటిక్స్‌

ఇదేనిజం,మహబూబ్‌నగర్‌: నడిగడ్డ (గద్వాల) పాలిటిక్స్‌ ఆసక్తిగా మారాయి. తమకు అనుకూలమైన అధికారులను నియమించుకోవాలని కాంగ్రెస్‌ లీడర్లు ప్లాన్‌ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల జిల్లా పరిధిలోని గద్వాల, అలంపూర్‌ రెండు నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందారు. దీంతో తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులను పెట్టుకొని .. జిల్లాలో పట్టు బిగించాలని కాంగ్రెస్‌ లీడర్లు భావిస్తున్నారు. గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో నిలిచిన సరితా తిరుపతయ్య ఓటమి పాలుకాగా, స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి మరోసారి విజయం సాధించారు. ఇక అలంపూర్‌లోనూ విజయుడు గెలుపొందారు.

నడిగడ్డ ఎప్పుడూ రసవత్తరమే

గద్వాల రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. తాజాగా జడ్పీ చైర్మన్‌ సరిత తిరుపతయ్య.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరి మధ్య పోటీ ఉండటంతో తాజాగా వీరిద్దరూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. సరితా తిరుపతయ్య ఓడిపోయినప్పటికీ ఇక్కడ పట్టు బిగించేందుకు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉంటున్న వీరిద్దరు తమకు అనుకూలంగా ఉండే అధికారులను బదిలీ చేయించుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అటు జడ్పీ చైర్ప్‌ర్సన్‌ సరితా తిర్పతయ్య ఎవరికి వారు పావులు కదుపుతున్నాట్లు సమాచారం. దీంతో గద్వాల రాజకీయమంతా అధికారుల బదిలీలపైనే సాగుతున్నాయని చర్చించుకుంటున్నారు స్థానికులు. అధికారుల బదిలీల్లో తమ మార్కు ఉండేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు గద్వాల కాంగ్రెస్‌ నేతలు. జిల్లాస్థాయి మొదలుకోని , క్షేత్ర స్థాయి వరకు తాము సూచించిన వారుంటే జిల్లాపై తమ పెత్తనం కొనసాగుతుందని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే గద్వాల జిల్లాలోని పోలీస్‌, రెవెన్యూ , సివిల్‌ సప్లై ,ఎక్సైజ్‌ , అగ్రికల్చర్‌ శాఖలతో పాటు ఇతర శాఖల్లోనూ తాము సిఫారసు చేసిన అధికారుల నియామకం పై దృష్టి సారించినట్లు సమాచారం.

ముఖ్యంగా గద్వాల జిల్లాలో కొనసాగుతున్న ఇసుక దందా , బియ్యం దందా , కల్లు దందా పై ఆధిపత్యం కోసమేనని జనం చర్చించుకుంటున్నారు. ఆయా శాఖల్లో తమ సిఫారసుతో పోస్టింగ్‌లు పొందిన అధికారులుంటే , తమ పనులు చక్కబెట్టుకోవడం తో పాటు , వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు. జడ్పీ చైర్స్‌ పర్సన్‌గా కొనసాగుతూ తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకోవచ్చని భావిస్తున్నారు. మరో పక్క పోలీస్‌ శాఖ తో పాటు ఆయా శాఖల అధికారులు పోస్టింగ్‌ల కోసం జడ్పీ చైర్మన్‌ సరితా తో పాటు జిల్లా మంత్రి జూపల్లి క్రిష్ణారావు చుట్టూ అధికారులు తిరుగుతున్నట్లు సమాచారం. పోస్టింగ్‌ల విషయంలో తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగ్‌ లు ఇప్పించుకునే పనిలో కాంగ్రెస్‌ నాయకులు ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితే అలంపూర్‌లో కూడా కనిపిస్తోంది. ఎమ్మెల్యే పదవి దక్కకపోవడంతో తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగులు ఇప్పించుకొని..అధికారాన్ని చెలాయించాలని కాంగ్రెస్‌ నాయకులు చూస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగ్‌లు ఇప్పించుకోవాలని స్థానిక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి గద్వాలజిల్లాలో అధికారులు పోస్టింగులు రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. అధికారుల బదిలీల్లో రాజకీయ నేతల పెత్తనం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

Recent

- Advertisment -spot_img