సమంత రుతు ప్రభు.. ఈ పేరు చెప్పగానే సినిమాలు, కాంట్రవర్సీలు, విమర్శలు, ట్రోల్స్ ఇలా చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే ఈమె జీవితం సినిమాని మించిపోయేలా ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్‌తో పాటు ట్రాజెడీ అనిపించే సంగతులు చాలానే వినిపిస్తాయి. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14 ఏళ్లు అయినా ఇప్పటికీ ఒక సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతోంది సమంత. ఇవాళ సమంత 37వ పుట్టిన రోజు. తమిళనాడులోని చెన్నైలో 28 ఏప్రిల్ 1987లో సమంత జన్మించింది. అక్కడే చదువుకుంది. డిగ్రీ చివరలో ఉండగానే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందు పాకెట్ మనీ కోసం పార్టీలు, ఈవెంట్స్‌లో వెల్‌కమ్ గర్ల్‌గా పనిచేసింది. అలానే ‘ఏ మాయ చేశావె’.. ఈమె తొలి సినిమా అని చాలామంది అనుకుంటారు. కానీ అంతకంటే ముందే తమిళంలో ‘మాస్కోవిన్ కావేరి’ అనే మూవీ చేసింది.
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్.. ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. 2010-19 వరకు దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో వరుసగా చిత్రాలు చేసిన సమంత.. ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపుల దెబ్బకు డౌన్ అయిపోయింది. సినిమాల సంగతి పక్కనబెడితే సమంత వ్యక్తిగత జీవితం అంతకు మించి ఉంటుంది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి.. 2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. కానీ ఏమైందో ఏమో గానీ 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీలో అందరూ షాకయ్యారు. కారణం ఏంటో తెలియకుండానే సమంతపై చాలా విమర్శలు చేశారు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుటికీ సస్పెన్సే.
2013లో తనకు డయాబెటిస్ ఉన్నట్లు బయటపెట్టిన సమంత.. జిమ్, హెల్తీ ఫుడ్ తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడింది. కానీ ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. 2022 అక్టోబరులో ఈ విషయాన్ని బయటపెట్టింది. దీని వల్ల దీర్ఘకాలిక కండరాల వాపు వస్తుంది. ప్రస్తుతం కొంతమేర ఈ వ్యాధి నుంచి కోలుకుంది. పూర్తిగా నార్మల్ అవ్వాలంటే మాత్రం కొన్నేళ్లు పట్టొచ్చని వైద్యులు తెలిపారు. సమంత జీవితంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం ‘ప్రత్యూష ట్రస్ట్’. తన కెరీర్ ప్రారంభంలోనే అంటే ఫిబ్రవరి 2014లో అనాథ పిల్లలకు సాయం చేయడం కోసం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి తన జీవితంలోని ప్రతీ స్పెషల్ సందర్భాన్ని ఆ పిల్లలతోనే జరుపుకుంటుంది సామ్. సమాజంలోని అణగారిన పిల్లలు, మహిళలకు వైద్య సహాయం అందించడం, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి రోగాలను నయం చేయడమే ఈ ట్రస్ట్ లక్ష్యం. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సమంతకు ఇదే నిజం వెబ్‌సైట్ తరపునుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు.