దేశ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు(high temperatures in Delhi) నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం 4.14 గంటలకు నగరంలోని మంగేశ్‌పూర్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయిన విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి వచ్చే వేడి గాలులే ఢిల్లీలో ఈస్థాయి ఉష్ణోగ్రతలకు కారణమని ఐఎండీ పేర్కొంది. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో ఈ హీట్ వేవ్‌ల ప్రభావం ఉంటుందనీ, ఇది జూన్‌లోనూ కొనసాగొచ్చని సంబంధిత అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందేందుకు ఢిల్లీ ప్రజలు భారీగా విద్యుత్ వినియోగించారు. బుధవారం రికార్డు స్థాయిలో వినియోగం 8302 మెగావాట్లకు చేరిందని డిస్కం అధికారులు ప్రకటించారు.