- రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇచ్చి, బోనాలకు రూ.5లక్షలు ఇస్తారా?
- ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలి
- అక్బరుద్దీన్.. దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయ్
- మేం కతర్నాక్ అభ్యర్థిని నిలబెట్టి చిత్తుగా ఓడిస్తాం..
- కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలని, లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించారు. అనంతరం బండి విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో బోనాల పండుగకు ప్రభుత్వం రూ. 5 లక్షలు మాత్రమే ఇస్తే, రంజాన్ పండుగకు రూ. 33 కోట్లు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామన్నారు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ఏమాత్రం దమ్మున్నా వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేయాలని సవాలు విసిరారు. అక్బరుద్దీన్‌ను కొడంగల్ నుంచి బరిలోకి దిగితే ఆయనకు ధీటుగా బీజేపీ నుంచి కొడంగల్‌లో కతర్నాక్ అభ్యర్థిని నిలబెడతామన్నారు. ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను ఇన్‌చార్జిగా నియమిస్తామని, అక్బరుద్దీన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. ఎంఐఎం గోడ మీద పిల్లిలాంటి పార్టీ అని, ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరడం ఆ పార్టీకి అలవాటేనని ఎద్దేవా చేశారు.