Homeహైదరాబాద్latest Newsఅమెరికాలో హైదరాబాద్​ వాసి మృతి

అమెరికాలో హైదరాబాద్​ వాసి మృతి

– కొద్ది రోజుల క్రితం అదృశ్యం
– ఆందోళన కలిగిస్తున్న తెలుగు విద్యార్థుల మరణాలు
– భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

ఇదేనిజం, రాజేందర్‌నగర్​ : అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన హైదరాబాద్​ కు చెందిన అబ్దుల్​ మహ్మద్​(25) అనే యువకుడి మృతదేహం చెరువులో దొరికింది. ఈ విష‌యాన్ని న్యూయార్క్‌లోని భార‌త దౌత్య కార్యాల‌యం మంగ‌ళ‌వారం ఎక్స్‌లో ప్ర‌క‌టించింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. మృతదేహం తరలింపునకు సహాయం చేస్తామని పేర్కొన్నది.

వివరాల్లోకి వెళితే.. అబ్దుల్ క్లీవ్‌ల్యాండ్ విశ్వ‌విద్యాల‌యంలో ఐటీ విభగంలో మాస్ట‌ర్స్ చేసేందుకు వెళ్లాడు. అబ్దుల్​ గ‌త నెల 7న నుంచి అదృశ్య‌మ‌య్యాడని, అతనికి గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని తండ్రి మ‌హ‌మ్మ‌ద్ స‌లీం తెలిపారు. వారు 1200 డాల‌ర్లు డిమాండ్ చేస్తున్నార‌ని, ఇవ్వ‌ని ప‌క్షంలో త‌మ కుమారుడి కిడ్నీ విక్ర‌యిస్తామ‌ని హెచ్చ‌రించిన‌ట్టు చెప్పారు. తాము అంగీక‌రించి, అబ్దుల్ వాళ్ల అధీనంలోనే ఉన్న‌ట్టు ఆధారాలు చూపాల‌ని అడిగామ‌ని, దీనికి కిడ్నాప‌ర్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి ఫోన్ పెట్టేశార‌ని, మళ్లీ ఫోన్​ చేయలేదని రోదిస్తూ తెలిపారు. కాక‌పోతే కిడ్నాప‌ర్ మాట్లాడటానికి ముందు ఫోన్‌లో ఎవ‌రిదో ఏడుపు వినిపించిందని చెప్పారు. ఆ నంబ‌ర్‌ను అమెరికాలోని త‌మ బంధువుల‌కు పంపి, క్లేవ్ ల్యాండ్ పోలీసుల‌కు అంద‌జేయాల‌ని చెప్పిన‌ట్టు స‌లీం తెలిపారు. పోస్టుమార్టం తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయని అమెరికా పోలీసులు తెలిపారు.

అమెరికాలో ఆగని మరణాలు
అమెరికాలో భార‌తీయ విద్యార్థుల మ‌ర‌ణాలు ఆగ‌డం లేదు. 2024 ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతున్నది. అటు దాడులు సైతం యథేచ్ఛగా జరుగుతున్నాయి. మార్చిలో భారత్‌కు చెందిన 34 ఏళ్ల శాస్త్రీయ నృత్య కళాకారుడు అమర్‌నాథ్ ఘోష్‌ను మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో కాల్చి చంపారు. మూడు రోజుల కిందటే క్లీవ్‌ల్యాండ్‌లోనే నివసిస్తోన్న ఉమా సత్యసాయి గద్దె అనే తెలుగు విద్యార్థి మరణించారు. అంతకుముందు – బోస్టన్ యూనివర్శిటీలో చదువుకునే గుంటూరుకు చెందిన విద్యార్థి పరుచూరి అభిజిత్.. మృతదేహాన్ని ఓ కారులో పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలో దుండగులు దాడి చేశారు. పర్డూ యూనివర్సిటీలో 23 ఏళ్ల విద్యార్థి సమీర్ కామత్‌.. ఫిబ్రవరి 5న ఇండియానాలో మృతదేహమై కనిపించారు. పర్డ్యూ యూనివర్శిటీ విద్యార్థి నీల్ ఆచార్య అనుమానాస్పద మృతి, జార్జియాలో వివేక్ సైనీ దారుణ హత్యోదంతం, ఐటీ నిపుణుడు వివేక్ తనేజాపై వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్ సమీపంలో ప్రాణాంతక దాడి.. ఇవన్నీ అమెరికాలో నివసించే భారతీయులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img