Homeహైదరాబాద్latest Newsమేడారంలో ఆ తప్పు చేస్తే తేనెటీగల దాడి తప్పదా? వందల ఏళ్లుగా ఇదే మహిమ..

మేడారంలో ఆ తప్పు చేస్తే తేనెటీగల దాడి తప్పదా? వందల ఏళ్లుగా ఇదే మహిమ..

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అడుగడుగునా అద్భుతాలే. గద్దెల దగ్గరున్న జువ్విచెట్టు నుంచి చిలకలగుట్ట సమీపంలో తేనెతుట్ట వరకూ జాతరలో ప్రతి ఘట్టమూ అద్భుతమే. శివసత్తుల పూనకాలు, పొర్లు దండాలు, బెల్లం ఘుమఘుమలు, బంగారం మొక్కులు ఇలా.. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. అతిపెద్ద గిరిజన జాతరగా, రాష్ట్ర పండగగా ఖ్యాతి గడించిన ఈ జాతర రెండేళ్లకోసారి కన్నుల పండువగా జరుగుతుంది. ఈ జాతరలో అడుగడుగూ అద్భుతమే. సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్విచెట్టును ఎంతో మహిమగలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమిస్తాడని చెబుతారు. సమ్మక్క, సారలమ్మ దర్శనానికి ఎంతమంది వస్తారో చూస్తుంటాడట. కుంకుమభరిణె ఉండే ప్రాంతం అయిన చిలుకలగుట్టను అత్యంత మహిమాన్వితమైనదిగా భావిస్తారు. ఈ గుట్ట చుట్టూ తేనెటీగలు కాపలా ఉంటాయి. ఆ ప్రదేశంలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే తేనెటీగలు వెంటబడి తరుముతాయని ఆదివాసీల విశ్వాసం. చిలుకలగుట్టపై నుంచి రెండు సన్నని జలధారలు నిరంతరాయంగా ప్రవహిస్తుంటాయి.

వీటిని సమ్మక్క, సారలమ్మ జలధారలుగా చెబుతారు. ఈ నీటిని తాగితే రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. సమ్మక్కను తీసుకు రావడానికి ఒకరోజు ముందు చిలుకలగుట్టపైకి వెళ్లే పూజారుల చేతుల్లో ఓ కాంతిరేఖ వచ్చిపడుతుందని అదే సమ్మక్క ప్రతిరూపంగా పూజారులు చెబుతారు. మేడారం మహా జాతరలో నెలలు నిండిన గర్భిణులూ అమ్మవార్లను దర్శించుకుంటారు. భక్తి భావంతో కొందరు మేడారంలోనే ప్రసవం కావాలని కోరుకుంటారు. వీరిలో కొందరు జాతరలోనే బిడ్డలకు జన్మనిస్తారు. ఆడపిల్లలు పుడితే సమ్మక్క, సారలమ్మ అని, అబ్బాయి పుడితే జంపన్న అనే పేర్లు పెట్టుకుని మురిసిపోతారు. జాతర రెండో రోజు నెమలి నార చెట్టు పై నాగు పాము వస్తుందని ఆదివాసులు చెబుతారు. ఈ చెట్టు బెరడు తీసుకుని వాటి పొడి పిల్లలకు పాలలో వేసి తాగిస్తే ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకంతో భక్తులంతా ఆ చెట్టు బెరడు తీసుకెళ్లేవారు. ఆ భారీ వృక్షం క్రమంగా ఎండిపోవడంతో ప్రస్తుతం తిరిగి మరో చెట్టుని ఫెన్సింగ్ వేసి జాగ్రత్తగా పెంచుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజుల పాటూ మేడారం జాతర….సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తారు.

Recent

- Advertisment -spot_img