Homeఅంతర్జాతీయంIf you sell laughing gas, you will go to jail లాఫింగ్...

If you sell laughing gas, you will go to jail లాఫింగ్ గ్యాస్ అమ్మితే జైలుకే

– నైట్రస్ ఆక్సైడ్​ ఉత్పత్తి,సరఫరాపై నిషేధం విధించిన బ్రిటన్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ‘లాఫింగ్‌ గ్యాస్‌’గా పిలిచే నైట్రస్‌ ఆక్సైడ్‌ను వినోదభరిత కార్యకలాపాల కోసం వాడకంపై బ్రిటన్‌ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. ఆ డ్రగ్‌ను ఉత్పత్తి చేయడం, సరఫరా లేదా అమ్మడం చేస్తే జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ గ్యాస్‌ కారణంగా ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘బహిరంగ ప్రదేశాల్లో చాలా కాలం నైట్రస్‌ ఆక్సైడ్​ను వాడటం.. సంఘ వ్యతిరేక ప్రవర్తనకు కారణమయ్యే అవకాశముంది. ఇది కమ్యూనిటీలకు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు. దీన్ని మేం అంగీకరించబోం’అని బ్రిటన్‌ పోలీసింగ్ మినిస్టర్‌ క్రిస్‌ ఫిలిప్‌ తన అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ‘వాస్తవం నుంచి దూరం చేసి ఓ భ్రమలో ఉండే అనుభూతినిచ్చే ఈ పదార్థం.. ఇబ్బందికర ప్రవర్తనలకు ఆజ్యం పోస్తుంది. ప్రజల ఆరోగ్యానికి కూడా ఇది ముప్పుగా మారుతోంది’అని యూకే సర్కారు మరో ప్రకటనలో వెల్లడించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది. అయితే, ఆరోగ్య సంరక్షణ కోసం, ఇతర పరిశ్రమల్లో చట్టబద్ధంగా నైట్రస్‌ ఆక్సైడ్‌ వాడకంపై ఈ నిషేధం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త నిబంధనల కింద.. ఎవరైనా ఈ లాఫింగ్‌ గ్యాస్‌ను దుర్వినియోగం చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనిష్ఠంగా రెండేళ్ల నుంచి గరిష్ఠంగా 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. బ్రిటన్‌ ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. యూకేలో 16-24 ఏళ్ల వయసు వారు అత్యధికంగా వినియోగిస్తున్న మూడో డ్రగ్‌ నైట్రస్‌ ఆక్సైడ్‌. దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల రక్తహీనత బారిన పడే అవకాశమున్నట్లు ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. దీని తీవ్రత ఎక్కువైతే నరాలు దెబ్బతినడంతో పాటు పక్షవాతానికి దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే లాఫింగ్‌ గ్యాస్‌ను నిషేధించాలని రిషి సునాక్‌ ప్రభుత్వం ప్రతిపాదించగా.. తాజాగా దీన్ని అమల్లోకి తెచ్చారు. వచ్చే ఏడాది యూకేలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది.

Recent

- Advertisment -spot_img