Homeహైదరాబాద్latest Newsజోరుగా నీటి అక్రమ వ్యాపారం

జోరుగా నీటి అక్రమ వ్యాపారం

– పొలాల బోర్ల నుంచి 24 గంటలు తోడుతన్న వైనం
– బౌరంపేట్‌లో యథేచ్చగా అక్రమ నీటి వ్యాపారం
– వాల్టా చట్టానికి మంగళం!
– వ్యాపారికి సహకరిస్తున్న అధికార పార్టీ నేతలు

ఇదే నిజ, కుత్బుల్లాపూర్: ఎండలు మండుతుండడంతో నీటి వ్యాపారం జోరందుకుంది. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన భూగర్భ జలాలను తోడేస్తూ ట్యాంకర్ల ద్వారా తరలించి విక్రయాలకు పాల్పడుతున్నారు. చట్టానికి వ్యతిరేకంగా నీటి విక్రయాలు జరుపుతూ ఒక్కరోజులోనే వందలాది ట్యాంకర్ల నీటిని విక్రయిస్తూ భూగర్భ నీటి నిల్వకు మంగళం పాడుతున్నారు. అయితే ఇంతలా అక్రమ వ్యాపారం జరుపుతున్నప్పటికీ ఈ విషయం తమ దృష్టికి రాలేదంటున్న అధికారులు, పరిశీలించి చర్యలు తీసుకుంటామని అనడం గమనార్హం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్‌లోని మంకమ్మకుంట ఎఫ్‌టీ‌ఎల్‌పై భాగాన ఒకే చోట పలు బోరుబావులు తవ్విన ఓ వ్యక్తి అక్కడి నుండి ప్రతిరోజూ 20 టాంకర్ల ద్వారా వందలాది ట్రిప్పుల నీటిని తరలిస్తున్నాడు. వాటిని ప్రగతి నగర్ పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నాడు. ఒక్కో టాంకర్ నీటికి రూ.1800 నుండి రూ.2,500 వరకు సొమ్ము చేసుకుంటున్నాడు. విచిత్రం ఏమిటంటే వ్యవసాయ అవసరాలకు తవ్విన బోరు బావులను లీజుకు తీసుకున్న ఓ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి నీరు తోడేందుకు వినియోగిస్తున్న విద్యుత్‌ను సైతం రైతుల ఖాతాలో చూపుతూ కరెంట్ బిల్లుల నుండి తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. వల్టా చట్టం ప్రకారం సదరు వ్యాపారానికి వినియోగించే బోరు బావులకు కమర్షియల్ మీటర్లను వినియోగించాలి. పైగా సదరు బోరు బావులకు సైతం అనుమతులు ఉన్నాయా… లేదా అనే విషయాలను రెవెన్యూ అధికారులు నిర్థారించలేక పోతున్నారు.

ఉచిత కరెంట్ దుర్వినియోగం

ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంట్ సదుపాయాన్ని కల్పిస్తుంది. సదరు వ్యక్తి పంట పొలాల్లోని బోరులోంచి నీటిని తోడటానికి ఉచిత కరెంట్‌ను వినియోగిస్తున్నాడు. ఫలితంగా ఈ పథకం దుర్వినియోగం అవుతుంది.

రోజుకు రూ.2 లక్షల ఆదాయం…
కాగా సదరు వ్యాపారి కేవలం టాంకర్ల ద్వారానే ప్రతినిత్యం సుమారు రూ.2 లక్షలను సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు ఒక్కొక్క టాంకర్ ద్వారా కనీసం 10 ట్రిప్పుల నీటిని అమ్ముతుంటాడని, అలా 20 టాంకర్ల ద్వారా సుమారు 150-200 ట్రిప్పుల వరకు టాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్ని ఖర్చులు పోనూ ప్రతినిత్యం రూ.2 లక్షల వరకు వెనకేసుకుంటున్నాడని సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా సదరు నీటి వ్యాపారానికి మద్దతుగా ఓ అధికార పార్టీ నేత కొమ్ము కాస్తున్నట్లు సమాచారం. ఎవరైనా అక్రమనీటి వ్యాపారంపై ప్రశ్నిస్తే సదరు నేత రంగ ప్రవేశం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img