రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బిడ్డలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయాల కన్నా.. వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయి అని హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు కోటి ఆశలు చూపిన కాంగ్రెస్ పార్టీ.. ఏట్లో రాయి కాదు, కనీసం కూట్లో రాయి కూడా తెలియలేదు అని అన్నారు. అభయ హస్తం ప్రజలను భయ పెట్టే, బాధ పెట్టే హస్తంగా మారింది అని.. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు 390 రోజులు గడిచినా మొదలు కాలేదు అని పేర్కొన్నారు.
గ్యారంటీలు అమలు చేయమంటే గారడీల విన్యాసం చేస్తున్నారు అని విమర్శించారు. ఏడాది పాలన తర్వాత అనేక సర్వే ఏజెన్సీలు ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నాలు చేశాయి.. ఏ సర్వేలో కూడా రేవంత్ కు పాస్ మార్కులు కూడా రాలేదు అని అన్నారు. ఎవరిని అడిగినా రేవంత్ ను తిడుతున్నరు అనే సమాధానం వస్తోంది తెలిపారు. డిక్లరేషన్లు అమలు చేసే బదులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు. ప్రశ్నిస్తే పగబడుతున్నారు ..పాలసీ ఏదీ అంటే పోలీసులను పంపుతున్నారు అని మండిపడ్డారు. రుణ మాఫీ చివర విడత చెక్కు అని హంగామా చేశారు ..ఇంకా డబ్బులు రైతుల అకౌంట్లలోనే జమ కాలేదు అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై క్షణాల్లో కేసులు పెడుతున్న పోలీసులు.. కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదుచేస్తే పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు.సీఎంకు ఢిల్లీ పర్యటనల ధ్యాసే తప్ప.. గల్లీల్లో ఉన్న గురుకులాల మీద పట్టింపు లేదు అని విమర్శించారు. రాజకీయ కక్షలు మానండి – రాష్ట్రం అభివృద్ధి కక్ష్య లో పరిభ్రమించేట్టు గా పాలన సాగించండి అని హరీశ్ రావు పేర్కొన్నారు.