తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరీ ముఖ్యంగా తెల్లవారుజామున పొగ మంచు కప్పేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటినా ఆ ప్రభావం అలాగే ఉంటోంది. దీంతో రోడ్లపైకి వచ్చే వాహనదారులు లైట్లు వేసుకుని వాహనాలను నడిపించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో సాధారణ, రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ‘లా నినా’ ప్రభావంతో ముందు ముందు మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.