Homeజాతీయంస‌రిహ‌ద్దుల్లో శాంతికి కుదిరిన ఒప్పందం

స‌రిహ‌ద్దుల్లో శాంతికి కుదిరిన ఒప్పందం

మాస్కో: భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు మందడుగు వేశాయి. ఎక్కువ కాలం స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌లు కొన‌సాగితే ఇరు దేశాల‌కు మంచిది కాద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాయి. మాస్కో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో మన విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పి యథాతథ స్థితికి చేరుకునేలా ఐదు అంశాలతో కూడిన ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు. సుమారు నాలుగు నెలలుగా తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో అనేక సార్లు కుదిరిన ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డ చరిత్ర చైనాకు ఉంది. తాజాగా కుద‌రిన ఒప్పందానికి అది ఏ మేర‌కు కట్టుబడి ఉంటుందో చూడాలి.
ఒప్పందంలోని ప్ర‌ధాన అంశాలు

  • విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాలి.
  • సరిహద్దు దళాల మ‌ధ్య‌ చర్చలు కొనసాగించాలి. సైనిక ఉపసంహరణ చేప‌ట్ట‌డంతోపాటు ఎల్‌ఏసీ వద్ద రెండు దేశాల సైనికులు సమాన దూరం పాటించాలి.
  • ఇరు దేశాల మధ్య కుదిరిన గ‌త ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌కు కట్టుబడి ఉండాలి.
  • సరిహద్దు వివాదాల్ని ప‌రిష్క‌రించుకునేందుకు ఏర్పాటు చేసిన‌ ‘వర్కింగ్‌ మెకానిజం ఫర్‌ కన్సల్టేషన్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ ఆన్‌ ఇండియా-చైనా బార్డర్‌ అఫైర్స్’‌(డబ్ల్యూఎంసీసీ) కమిటీ సమావేశాలు కొనసాగించాలి.
  • ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే దిశగా నిర్మాణాత్మక చర్యల్ని వేగవంతం చేయాలి.

Recent

- Advertisment -spot_img