Homeజాతీయంఇండియా-చైనాల మధ్య స‌డ‌ల‌ని ఉద్రిక్త‌త‌

ఇండియా-చైనాల మధ్య స‌డ‌ల‌ని ఉద్రిక్త‌త‌

ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి స్థాయిలో చ‌ర్చ‌ల‌కు చైనా ప్రతిపాదన
న్యూఢిల్లీః ఇండియా, చైనా బార్డ‌ర్‌లో ఉద్రిక్తత ఇంకా ఆందోళ‌న‌గానే ఉంది. రెండు దేశాల సైనికులు పాంగాంగ్ స‌రస్సు ద‌క్షిణ భాగంలోని ఫింగ‌ర్ 4 పై ఎదురెదురుగా క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇరువురు వెన‌క్కి మ‌ళ్లేందుకు స‌సేమిరా అన‌డంతో ప్ర‌స్తుతం ప‌రిస్థితి ఉద్రిక్త‌త‌గానే ఉంద‌ని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇండియన్ ఆర్మీ దూకుడు పెంచ‌డంతో చైనా అధికారులు దౌత్య ప్ర‌యత్నాల‌ను తీవ్రం చేసిన‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా ఇండియా, చైనా ర‌క్ష‌ణ మంత్రుల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు చైనా ర‌క్షణ శాఖ మంత్రి వే ఫెంఝీ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేశారిన‌, ఈ మేరకు భారత దౌత్యాధికారులకు చైనా ప్రతినిధులు సమాచారం అందజేసిన‌ట్లు తెలియవ‌స్తోంది. భారత్‌-చైనా సరిహద్దు వివాదాలు కేవలం దౌత్యపరంగానే పరిష్కారమవుతాయని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా నుంచి చ‌ర్చ‌ల‌కు ప్రతిపాదన రావడం గమనార్హం. ర‌క్ష‌ణ మంత్రుల స‌మావేశానికి కేంద్ర ప‌చ్చ‌జెండ ఊపిన‌ట్లు స‌మాచారం.
పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి: ఆర్మీ చీఫ్ ‌
ఇండియా‌-చైనా బార్డ‌ర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె అన్నారు. దేశ భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాలను మోహరించామ‌ని, వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నా దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామ‌న్నారు. గత రెండు, మూడు నెలల నుంచి పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని, సైనిక, దౌత్య మార్గాల్లో చైనాతో నిరంతరం చర్చలు జ‌రుగుతున్నాయ‌ని, వాటితో సరిహద్దుల్లోని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img