Homeహైదరాబాద్latest Newsరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొనకపోవడం కరెక్టేనా?

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొనకపోవడం కరెక్టేనా?

ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు, ఆత్మార్పణలు. వెరసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారం సాధ్యం. అరెస్టులు, నిర్బంధాలు, నిరసనలు, ర్యాలీలు, లాఠీచార్జ్‌లు…ఇలా తెలంగాణ ఉద్యమం సాగిన తీరు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రత్యేక రాష్ట్ర సాకారం కోసం ఇక్కడి ప్రజలు చేసిన పోరాటం చిరస్మరనీయం.

దశాబ్దాల పాటు పొరుగు పాలనలో మగ్గిన ఇక్కడి ప్రజలకు స్వేచ్చా స్వాతంత్రాలు సమకూరిన రోజు జూన్ 2. స్వరాష్ట్రం సిద్దించి పదేళ్లు గడిచిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించింది. ప్రత్యేక ఆహ్వానితులుగా కేసీఆర్‌కు ఇన్విటేషన్ కూడా పంపింది. స్వయంగా సీఎం రేవంత్ కేసీఆర్‌కు లేఖ రాసి అధికారుల ద్వారా పంపించారు. కానీ కేసీఆర్ మాత్రం వేడుకలకు రాలేదు. దీంతో వేడుకల్లో కేసీఆర్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక కుర్చీ ఖాళీగానే దర్శనమిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశలో తీసుకువెళ్తోందన్న ఆరోపణల నేపథ్యంలో హాజరుకాలేనని తేల్చిచెప్పారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేవలం ఏ ఒక్కరికి చెందినవో కావు. కోట్ల ప్రజల ఆకాంక్షకు సంబంధించింది. రాజకీయాలు, పార్టీలు, అధికార విపక్షాలు అనే తేడా లేకుండా అందరూ కలిసి వేడుకలు నిర్వహిస్తే అమరుల త్యాగాలకు విలువ ఇచ్చినట్లు ఉండేది. హుందాగా వ్యవహరించాల్సి ఉంది. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే కొందరు వేడుకలకు దూరంగా ఉన్నారని ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. నిజానికి కేసీఆర్ తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో ఉండగా సీఎం రేవంత్ పరామర్శించారు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా వ్యవహరించారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.

రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లారు. అప్పటికి చంద్రబాబు, కేసీఆర్‌కు పడటం లేదు. అయినా బాధ్యత కలిగిన వ్యక్తిగా, తెలుగు ప్రజల మేలు కోసం ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీ, కేసీఆర్, చంద్రబాబు వంటి ప్రముఖ వ్యక్తులు ఒకే వేదికపై కనబడటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదేవిధంగా ఇప్పుడు కూడా వేడుకలకు హాజరైతే బాగుండేది. సరిగ్గా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్‌కు గంట ముందు సీఎం రేవంత్‌కు కేసీఆర్ 22 పేజీల లేఖ రాశారు. వేడుకలకు రాలేనని అందులో చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్‌ఎస్ కు 0-1 సీట్లు మాత్రమే వస్తాయని చాలా సర్వేలు తేల్చి చెప్పాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ విషయం కేసీఆర్‌కు ముందే తెలిసే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసి కొంచెం కలత చెంది ఉంటారు. ఒకవేళ బీఆర్‌ఎస్ డబుల్ డిజిట్ కొడితే వేడుకలకు హాజరయ్యేవారేమో!

Recent

- Advertisment -spot_img