HomeTelugu Newsమన తెలంగాణలో మళ్లీ దళారుల రాజ్యం రానుందా..?

మన తెలంగాణలో మళ్లీ దళారుల రాజ్యం రానుందా..?

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ .. ప్రస్తుతం నిధుల వేటలో ఉంది. గత ప్రభుత్వం తమకు అప్పులు తప్ప ఆదాయం ఏమీ మిగల్చలేదని కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్​ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నారు. అంతేతప్ప తాము ఎలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామో చెప్పడం లేదు. దీంతో ఇప్పటికే ప్రజల్లో డౌట్స్​ మొదలయ్యాయి. మరోవైపు వంద రోజుల్లో కచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్​ ప్రకటించింది. అందులో భాగంగా ప్రస్తుతం ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఈ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో? అర్హులను ఎప్పుడు ఎంపిక చేస్తారో? తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. కోడ్​ వచ్చే వరకు దరఖాస్తుల పేరిట కాలయాపన చేస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు పాత లబ్ధిదారులకు సైతం ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు. పింఛన్​, రైతు బంధు పడలేదు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామగ్రామాన ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్టు.. బుధవారం గాంధీభవన్ లో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఇందిరమ్మ కమిటీలు ఏం చేస్తాయి?
అయితే ఆరు గ్యారెంటీల అమలు కోసం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్టు కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. కానీ ఈ కమిటీలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన అర్హుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీల పాత్ర ఉంటుందా? అన్న డౌట్స్​ వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఆరు గ్యారెంటీ పథకాలు కేవలం కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు లేదంటే వాళ్లు చెప్పిన వారికే వచ్చే అవకాశం ఉంది. దీంతో నిజమైన అర్హులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే రైతు బంధు పథకం మీద మంత్రులు తమ మనసులోని మాటను బయటపెట్టారు. అందరికీ రైతు బంధు దక్కదు. సీలింగ్​ పెడతాం అంటూ మాట్లాడారు. అయితే ఒకవేళ సంక్షేమ పథకాల అమలు బాధ్యత కనక ఇందిరమ్మ కమిటీలకు అప్పగిస్తే.. కేవలం కాంగ్రెస్​ అనుయాయులకే లబ్ధి జరుగుతుందన్న డౌట్స్​ వస్తున్నాయి.

దళారీ రాజ్యం తప్పదా?
సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్​ లోకి వెళ్లే ఎటువంటి అవినీతి జరగదు. కానీ మధ్యలో దళారులు ఏ రూపంలో ఉన్నా కచ్చితంగా పథకాలు తప్పుదారి పడతాయి. కేసీఆర్​ ప్రభుత్వంలో రైతు బంధు, పింఛన్లు లాంటి పథకాలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోకి వెళ్లాయి. అయితే దళితబంధు, డబుల్​ బెడ్రూం ఇండ్ల విషయంలో మాత్రం బీఆర్ఎస్​ కార్యకర్తలు, నాయకుల జోక్యం కనిపించింది. దీంతో ఈ పథకాల మీద అనేక ఆరోపణలు వచ్చాయి. నేరుగా పార్టీ సమావేశంలో కేసీఆరే దళితబంధు స్కీమ్​ లో అవినీతి గురించి మాట్లాడారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పార్టీ కార్యకర్తలు ఎంట్రీ ఇస్తే కచ్చితంగా అవినీతి జరిగే అవకాశం ఉంది. గతంలో ఏపీలోనూ ఇదే పరిస్థితి జరిగింది. చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు. అన్ని పథకాలకు సంక్షేమ పథకాల ఎంపికలో ఈ కమిటీలదే ప్రధాన పాత్ర. మరోవైపు ఓ సామాజికవర్గానికి చెందిన వారే జన్మభూమి కమిటీల్లో కీలకంగా వ్యవహరించారు. దీంతో జన్మభూమి కమిటీలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్​ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీలు కూడా కాబోతున్నాయా? అన్న డౌట్స్ వస్తున్నాయి.

ఆకలి మీదున్న కాంగ్రెస్​ కేడర్​
పదేండ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో లేదు. దీంతో కాంగ్రెస్​ లీడర్లతోపాటూ ద్వితీయశ్రేణి నేతలు, పార్టీ కేడర్​ సైతం ఆకలితో ఉంది. ఇక కాంగ్రెస్​ పార్టీ గత చరిత్ర గమనించినా ఆ పార్టీకి అవినీతి మరకలు ఉన్నాయి. గతంలో రాజశేఖర్ రెడ్డి పీరియడ్​ లో ఇందిరమ్మ ఇండ్లు లాంటి పథకాలపై అవినీతి మరకలు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్​ కార్యకర్తలు, వారి అనుయాయులకే ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో నాటి పరిస్థితే మళ్లీ రిపీట్​ కాబోతున్నదా? అన్న డౌట్స్​ కూడా వస్తున్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్​ పార్టీ తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రంలో ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయో వేచి చూడాలి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img