Homeహైదరాబాద్latest Newsఈటలకు బండి రివెంజ్ గిఫ్ట్.. అధ్యక్ష పదవికి అడ్డం పుల్ల.. అసలు ఈటల, బండి మధ్య...

ఈటలకు బండి రివెంజ్ గిఫ్ట్.. అధ్యక్ష పదవికి అడ్డం పుల్ల.. అసలు ఈటల, బండి మధ్య లొల్లి ఏంటి?

  • రాజేందర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న.. బీజేపీ కోర్ హిందూవాదులు
  • ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వింగ్స్ కూడా..
  • రామచంద్రరావు వైపు హైకమాండ్ మొగ్గు
  • పార్టీ మారతానంటూ ఈటల బెదిరింపు గేమ్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఈటల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్ అడ్డం పడుతున్నారా? ఆయనతో పాటు బీజేపీలోని కోర్ హిందూవాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ లాంటి సంస్థలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయా? అంటే బీజేపీ వర్గాల నుంచి. అవుననే సమాధానమే వినిపిస్తోంది. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా దూసుకుపోతున్న క్రమంలో ఈటల హైకమాండ్ కు చాడీలు చెప్పి ఆయనను తప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. బండి అభిమానులు, సగటు బీజేపీ కార్యకర్తలు, రాష్ట్రంలోని హిందూ వాదులు ఇదే నమ్ముతారా? తనను అధ్యక్ష పదవి నుంచి దింపారు కాబట్టి.. ఇప్పుడు ఈటలకు ఈ పోస్ట్ రాకుండా సంజయ్ గట్టిగా అడ్డంపడుతున్నట్టు తెలుస్తోంది. ఈటలకు రివెంజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు బండి అస్త్రశస్త్రాలు మొత్తం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి వ్యవహారం బీజేపీ పెద్దలకు చాలా పెద్ద తలనొప్పిగా మారింది. ఈటలకు పదవి ఇస్తే బండి నొచ్చుకుంటాడు.. ఆయనతో పాటు కార్యకర్తలు కూడా నిరుత్సాహపడతారు.. పోనీ ఈటలను పక్కన పెడతామంటే పార్టీ మారిపోతాడేమోనని భయం. ఈటల ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత.. కొంతమంది ఎమ్మెల్యేలను సైతం వెంటేసుకొని కాంగ్రెస్ లోకి దూకితే బీజేపీకి పెద్ద దెబ్బ పడుతుంది. అందుకే బీజేపీ హైకమాండ్ ఈ విషయం మీద ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది.

ఈటల, బండి మధ్య లొల్లి ఏంటి?
ఈటల రాజేందర్, బండి సంజయ్ ఈ ఇద్దరు లీడర్లు ఒకే జిల్లాకు చెందిన వారు. అంతేకాక భిన్నమైన రాజకీయ నేపథ్యం.. భిన్నమైన సిద్ధాంతాలు ఉన్న లీడర్లు. బండి సంజయ్ చిన్ననాటి నుంచే జాతీయభావాలతో ఎదిగిన లీడర్. ఏబీవీపీ లాంటి ఆర్గనైజేషన్ లో పనిచేసి.. ఒంటినిండా కాషాయ రక్తం ఎక్కించుకున్నాడు. బీజేపీ కి క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదిగాడు. బండికి మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఓ జిల్లాకో, నియోజకవర్గానికో పరిమితమైన లీడర్ కాదు.. రాష్ట్రం మొత్తం ఎఫెక్ట్ చూపగల నేత. ఇక ఈటల నేపథ్యం ఎంతో భిన్నమైనది. బీజేపీని నిత్యం వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీ సిద్ధాంతాలను తూర్పార పట్టే కమ్యూనిస్టు నేపథ్యం అతడిది. నిజానికి ఈటల రాజేందర్‌‌ భావజాలానికి బీఆర్ఎస్ లాంటి ఉద్యమపార్టీయో.. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీయే సెట్ అవుతుంది తప్ప.. బీజేపీ అస్సలు పడదు. కానీ ఆయన ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ గూటికి చేరారు. ఇక బండితో .. బీజేపీ లీడర్లతో ఈ కారణం వల్లే ఈటలకు పొసగడం లేదు. ఆయనను అధ్యక్షుడిగా చేసేందుకు పార్టీలోని మెజార్టీ వర్గం ఇష్టపడటం లేదు. ఈటల ప్రెసిడెంట్ అయితే ఆయన సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తారు తప్ప.. సైద్ధాంతికంగా బీజేపీనీ బలోపేతం చేయలేరన్నది వాళ్ల వాదన. ఇప్పుడు దీన్ని అస్త్రంగా చేసుకొని బండి సంజయ్ ఢిల్లీ స్థాయిలో ఈటలకు పదవి దక్కకుండా లాబియింగ్ చేస్తున్నారు.

ఈటలకు ఇవ్వకపోతే..
ఒకవేళ ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఆయన పార్టీ వీడుతారని హైకమాండ్ భావిస్తోంది. ఈటల బలమైన బీసీ సామాజికవర్గానికి ప్రతినిధిగా ఉన్నాడు. బీజేపీ కూడా తెలంగాణలో గట్టిగా నిలబడలాంటే బీసీ ఓటుబ్యాంక్ కీలకం అని భావిస్తోంది. ఒకవేళ ఈటల పోతే ఆ వర్గం ఓట్లు పోతాయేమోనని భయపడుతోంది. అలాగని ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే సొంత పార్టీలోనే సహాయనిరాకరణ ఎదురై.. పార్టీగా చీలికలు పేలికలై తీవ్ర నష్టం వాటిల్లే చాన్స్ ఉంది. అందుకే అధిష్ఠానానికి ఎటూ పాలుపోవడం లేదు. ఇదే అదునుగా బండి సంజయ్ తన మార్క్ రాజకీయానికి తెరలేపారు. గతంలో తనను అధ్యక్ష పదవి నుంచి ఈటల ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీటు మీద ఎక్కనివ్వకూడదన్నది బండి పంతం. ఇక తాను బీజేపీకి అధ్యక్ష పదవి చేపట్టి రాష్ట్రంలో బలమైన లీడర్ అనిపించుకోవాలని ఈటల తహతహ. మొత్తానికి ఈ వ్యవహారంలో ఈటలది పైచేయి అవుతుందా? లేదంటే బండి తన పలుకుబడి చూపిస్తారా? వేచి చూడాలి. ఒకవేళ ఇంతా చేసి ఈటలకు హైకమాండ్ అధ్యక్ష పదవి ఇస్తే బండి వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెరలేచే చాన్స్ ఉంటుంది. మరి హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img