Homeజిల్లా వార్తలుజగ్గూభాయ్ జీవో

జగ్గూభాయ్ జీవో

– అధికారులు మాట వినాల్సిందేనంటూ హుకుం

  • నేను ఓడిపోయినా మా పార్టీ పవర్ లోకి వచ్చింది కదా
  • ప్రతి కార్యక్రమానికి నా భార్యను పిలవండి
  • అధికారులకు జగ్గారెడ్డి హుకుం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంట్రవర్సీ లీడర్ జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోయినప్పటికీ అధికారులు తన మాట వినాల్సిందేనని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అధికారులకు సూచనలు చేస్తూ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో సంచలనంగా మారింది. తాను ఓడిపోయినా.. తమ పార్టీ గెలుపొందింది కాబట్టి.. అధికారులంతా తన మాట వినాల్సిందేనని హుకుం జారీ చేశారు. అన్ని సమావేశాలకు తన భార్యను పిలవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇప్పటి నుంచి ప్రభుత్వం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, నియోజకవర్గం అధికారిక కార్యక్రమం ఏది నిర్వహించినా.. దానికి తన భార్య పిలవాల్సిందేనని ఓ వీడియోను విడుదల చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే, ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం.. ఈరోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. దాంతోపాటు.. ఆరోగ్య శ్రీ పథకం పరిధిని రూ. 10 లక్షలకు పెంచుతూ చేయూత పథకాన్ని కూడా అమలు చేస్తున్నారని వివరించారు.

ఈ క్రమంలోనే.. “సంగారెడ్డి నియోజకవర్గ అధికారులంతా నా ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అధికారులు ఎవరు కూడా ఆశ్రద్ధ, నిర్లక్ష్యం వహించొద్దు. ఇక నుండి సంగారెడ్డి నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలకు నా భార్య నిర్మల జగ్గారెడ్డిని పిలవాలి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న. ఆ సమయంలో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యేనే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుచుకొని మొదలు పెట్టేవారు. అయినప్పటికీ.. నేను హుందాగా వ్యవహారించాను. ఏమీ అనలేదు అప్పుడు. ఇప్పుడు కూడా కొన్ని పరిస్థితుల వల్ల నేను ఓడిపోయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నా తరుపున ఇక నుంచి ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి నా భార్య నిర్మల అటెండ్ అవుతుంది. అధికారులు నిర్మలకి సమాచారం ఇవ్వాలి. ఆమె సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, సంగారెడ్డి నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. అధికారులు ఎవరు అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయొద్దు.” అంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img