– రాజకీయాల కోసం అతి పెద్ద ప్రాజెక్ట్‌ను బద్నాం చేయొద్దు
– మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చినం
– తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానంపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఇదే నిజం, హైదరాబాద్: తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై హైదరాబాద్‌లోని హోటల్ కాకతీయలో గురువారం ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2014కు ముందు తెలంగాణ ఎలా ఉండేదో.. 2023లో ఎలా ఉందో అని గణాంకాలు, ఫొటోలతో సహా ఆయన వివరించారు. తెలంగాణలో పంటల దిగుబడి పెరిందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా మారిందని కేటీఆర్ తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని, ఇందుకోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని, దీని స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ప్రాజెక్టుల కోసం రూ.లక్షా.70 లక్షల కోట్టు ఖర్చు పెట్టడమే కాకుండా.. నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నిర్మించినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. కాలువలు తవ్వి పాలమూరు ఎత్తిపోతల పథకాన్నీ పూర్తి చేశామన్నారు. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులని చెప్పారు. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సర్వసాధారణమని.. ప్రకాశం, ధవళేశ్వరం, కడెం రిజర్వాయర్లలోనూ సమస్యలు వచ్చాయని తెలిపారు. సాగర్ కట్టిన తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీట మునిగాయన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ ఎంత?
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బీఆర్ఎస్ సర్కారు లక్షా 60 వేల83 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని కేటీఆర్ స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంతో చెప్పే దమ్ముందా..? అని ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల్ విసిరారు. ‘తెలంగాణలో మరో 42 వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో ఉంది. మా కంటే మెరుగ్గా ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా..? ఉంటే తెలంగాణ పిల్లలకు చెప్పండి. ఊరికే గావుకేకలు, పెడబొబ్బలు కాదు. ఈ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వండి. ఫలానా చోట ఇంత కన్న ఎక్కువ చేశామని చెప్పండి. గుజరాత్‌లో 6 కోట్ల జనాభా ఉంది. రాజస్థాన్‌లో ఎనిమిదిన్నర కోట్లు, కానీ ఈ రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ అనుకున్నంత జరగలేదు. మనం 4 కోట్ల జనాభాకు లక్షా 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఎనిమిదిన్నర కోట్లు, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదు. వాళ్లొచ్చి మమ్మల్ని అంటున్నారు. ఇవి వాస్తవాలు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్‌సైట్ కూడా పబ్లిష్ చేశాం. కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా..? ప్రైవేటు సెక్టార్‌లో కూడా లక్షల ఉద్యోగాలు సృష్టించి ఉపాధి కల్పించాం’అని కేటీఆర్ తెలిపారు.