పాట్నాః బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ప్రసారమైన రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో 2011లో విజేతగా నిలిచి రూ. 5 కోట్లు గెలుచుకున్నసుశీల్ కుమార్ గుర్తున్నాడా. ఎప్పుడో మరిపోయే ఉంటారు. ఎందుకంటే ఆ తర్వాత కూడా ఎందరో ఆ షోలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. కానీ సుశీల్‌నే ఎందుకు గుర్తు పెట్టుకోవాలనే కదా మీ ప్రశ్న. ఓ సాధారణ జీవితం నుంచి ఒక్కసారిగా కోటీశ్వరుడైన సుశీల్ కుమార్ ఆ తర్వాత ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. కానీ మారిన లైఫ్ స్టైల్.. దురాలవాట్లు.. వెరసి 5 ఏళ్లలో ఆ డబ్బంతా పోగొట్టుకొని పొట్ట కూటికోసం తిరిగి నెలకు రూ.18 వేలు ఇచ్చే ఓ ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా తన కథతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తానే స్వయంగా తన కథను తన పేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చారు.
సెలబ్రిటీ హోదా.. భార్యతో గొడవలు
జీవితంలో ఒక్కసారిగా వచ్చిపడిన సెలబ్రిటీ హోదాతో సుశీల్ జీవితంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. కలెక్టర్ కావాలన్న తన కోరికకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. ఎక్కడికి పోయిన ఆటోగ్రాఫ్‌లు, మీడియా ఇంటర్వ్యూలు. దీంతో చదువుపై శ్రద్ధ తగ్గింది. వ్యాపారం చేస్తున్నానని బయటి వారికి చెప్పినా వాస్తవంగా అలాంటిది ఏమీ లేదు. నెలకోసారి ఢిల్లీకి పోయి అక్కడి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాడు. బంధువులు, ఫ్రెండ్స్ ఇలా అడిగిన వారందరికీ పైసలు ఇస్తూ పోయాడు. చివరకి భార్యతో గొడవలు ముదిరాయి. విషయం విడాకుల వరకు పోయింది. పెద్దల రంగప్రవేశంతో గొడవ పెద్దది కాకుండా ఆగింది. కానీ సుశీల్‌లో మార్పులు తీసుకురాలేకపోయింది.
బాలీవుడ్ కల్లలు.. స్వగ్రామమే దిక్కైంది
బాలీవుడ్‌లో తెలిసిన ప్రొడ్యుసర్లు, డైరెక్టర్లు ఉన్నారని, కథలు రాస్తానని.. పాటలు రాస్తానని.. డైరెక్టర్ అవుతానని ముంబాయి చేరుకున్నాడు. కానీ అక్కడా సుశీల్ మెరవలేదు. టీవీ ఇండస్ట్రీలో కొన్నాళ్లూ పనిచేసి సినిమాలోకి రావాలని తెలిసిన వాళ్లు చెప్పడంతో టీవీ రంగానికి మారాడు. అది కూడా బెడిసికొట్టింది. ఉన్న పైసలు కరిగిపోయాయి. అప్పులు పుట్టడం లేదు. తీసుకున్న వారు ఎవరూ పైసలు తిరిగి ఇవ్వడం లేదు. ఇంటి కాడ్నుంచి భార్య ఫోన్‌లు.. వెరసి తాను చేసిన తప్పును తెలసుకున్నాడు. తిరిగి స్వగ్రామానికి వచ్చి ఉపాధ్యాయుడిగా స్థిరపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదృష్టం కలిసి వచ్చినప్పుడు దానిని సక్రమంగా వినియోగించుకోకపోతే ఏమవుతుందో చెప్పడానికి సుశీల్ విఫలగాథ ఓ గుణపాఠమని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.
‘కరోడ్ పతి’ బన్‌గయా బికారి.. 5 ఏండ్లలో మారిన బతుకు చిత్రం
RELATED ARTICLES