HomeరాజకీయాలుKavita: BJP does not get deposits Kavitha : BJPకి డిపాజిట్లు రావు

Kavita: BJP does not get deposits Kavitha : BJPకి డిపాజిట్లు రావు

– కాంగ్రెస్ మాకు పోటీయే కాదు
– ఎమ్మెల్సీ కవిత కామెంట్స్​
– బీఆర్ఎస్​ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని వెల్లడి

ఇదేనిజం, హైదరాబాద్​: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సోమవారం ఆమె ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్​ గెలవబోతున్నదని.. మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమకు రాష్ట్రంలో పోటీయే కాదని పేర్కొన్నారు. అసలు అభ్యర్థులు కూడా లేని బీజేపీ తమను విమర్శించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా తెలంగాణనే ఫాలో అవుతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారన్నారు. దేశంలో బీఆర్ఎస్ ను చూసి బీజేపీ నేర్చుకుంటోందని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో గుబులు మొదలైందని, ఆ పార్టీల మైండ్ బ్లాంక్ అయిందని కవిత తెలిపారు. అందుకే ఆ రెండు పార్టీల నేతల అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లని, అబద్దాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని విమర్శించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా తమ పార్టీ మేనిఫెస్టో ఉందని, అన్ని వర్గాలకు మరింత అభ్యున్నతి కలిగేలా ఉందని తెలిపారు. ఇటువంటి మెనిఫోస్టో కలలో కూడా ఊహించలేదని, కేసీఆర్ ఇన్ని రకాల హామీలను ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు భావించలేదని కవిత చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చిత్తుకాగితంతో పోల్చడంపై కవిత మండిపడ్డారు. చిత్తుకాగితం కాంగ్రెస్ పార్టీదా తమ పార్టీదా అని ఎన్నికల్లో ప్రజలు తేల్చుతారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ అన్ని లెక్కలు తీసుకొని సహేతుకంగా ప్రకటించిన మేనిఫెస్టోను చిత్తుకాగితమంటే.. ఎటువంటి బాధ్యత, తాడూ బొంగరం లేని కాంగ్రెస్ చెప్పే మాటలు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
‘అంశాలవారీగా మాట్లాడకుండా అమరవీరుల స్థూపం వద్దకు రండి.. ప్రమాణం చేయండని సవాలు చేయడం రేవంత్ రెడ్డి స్థాయికి తగదు. అనేక మంది అమరులయ్యారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే రాహుల్ గాంధీని అమరజ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పించమని చెప్పండి. అప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు ఏమన్న తొలగిపోతాయో చూద్దాం’ అని కవిత సవాల్ విసిరారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తెలంగాణ స్థితిగతులపై ఎటువంటి అవగాహన లేదని విమర్శించారు. ఏమి తెలియని స్థానిక నేతలు రాసిచ్చే స్క్రిప్ట్ ను చదవడం కాంగ్రెస్ జాతీయ నాయకులు మానుకోవాలని సూచించారు. అబద్ధాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని, రూ. 15 లక్షలు ఒక్కో ఖాతాలో వేస్తామని చెప్పి విస్మరించారని, ఏటా 2 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని ఆమె విమర్శించారు.

తెలంగాణలో 2 లక్షల 21 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రైవేటు రంగంలో 30 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించి యువతకు భరోసా కల్పించామని వివరించారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని కవిత తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు ఏమయ్యాయో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని కవిత స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img