– ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటాం
– సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
– యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కు వెళ్లిన సీఎం రేవంత్.. కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ పరామర్శించాను.. ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. కేసీఆర్ వైద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని కోరా. తెలంగాణ ప్రజల సమస్యలపై సభలో కేసీఆర్ మాట్లాడాలి. కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకుంటాం’అని చెప్పారు. కాగా, గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న డాక్టర్లు శనివారం వాకర్ సాయంతో నెమ్మదిగా అడుగులు వేయించారు.