తెలంగాణలో ఈఏపీసెట్ పరీక్షకు ఈ ఏడాది 3.54 లక్షల మందికి పైగా రిజస్ట్రేషన్ చేసుకున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మే 7 నుంచి 11 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు JNTUలో మీడియా సమావేశం నిర్వహించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మాకు 135, ఇంజినీరింగ్ కు 166 కేంద్రాల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి 90 నిమిషాల ముందుగానే అనుమతిస్తామని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. గతంతో పోలిస్తే ఈసారి మరో 20 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌కు 2,54,543 మంది, అగ్రికల్చర్, ఫార్మాకు 1,00,260 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఈఏపీసెట్ కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం 3,54,803 దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.