రామగుండంలో సిట్టింగ్ శాసనసభ్యుడు చందర్ వైపే అధిష్టానం మొగ్గు
కారులో కొట్లాట తీరినట్టేనా?
అసమ్మతి నేతల దారెటు?
సయోధ్యనా? సమరమా?
రామగుండంలో త్రిముఖ పోరు ఖాయమే
ఇదే నిజం,రామగుండం
పెద్దపల్లి జిల్లా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగు శాసనసభ్యుడిగా ఉన్న కోరకంటి చందర్ కే కారు స్టీరింగ్ అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.కొద్ది రోజులుగా రామగుండం బీఆర్ఎస్ లో అసమ్మతి పోటును చందర్ ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా చందర్ కు టికెట్ ఇవ్వరాదని అసమ్మతి నేతలు ఏకంగా రోడ్డెక్కారు.అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు.సింగరేణి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, పాలకుర్తి జడ్పీటీసి కందుల సంధ్యారాణి,రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ,కార్మిక నేత పాతిపెళ్లి ఎల్లయ్య,కేశోరాం సిమెంట్ కర్మాగారం కార్మిక నేత బయ్యపు మనోహర్ రెడ్డిలు ప్రజా ఆశీర్వాద యాత్ర పేరిట సిట్టింగు శాసనసభ్యుడు చందర్ కు వ్యతిరేకంగా నిరసన గళాన్ని గట్టిగా వినిపించారు. కోరుకంటి చందర్ కే టికెట్ ఇచ్చే పక్షంలో ఆయనను ఓడించి తీరుతామని వారు అధిష్టానానికి సంకేతాలు పంపారు. దీంతో అలర్ట్ అయిన మంత్రి కెటిఆర్ అసమ్మతి నేతలను రాజధానికి పిలిపించి సముదాయించారు.పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని,పార్టాలో భవిష్యత్ ఉంటుందని,ఇంకా టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కెటిఆర్ అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో అసమ్మతి నేతలు కొద్దిగా వెనక్కి తగ్గి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ పరిస్థితుల్లో రామగుండం కారు స్టీరింగ్ సిట్టింగ్ శాసన సభ్యుడు కోరుకంటి చందర్ చేతిలోనే పెట్టినట్లుగా నమ్మదగిన సమాచారం. అన్ని అంశాలను బేరీజు వేసుకున్న అధిష్టానం చందర్ వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.రామగుండంలో త్రిముఖ పోరు ఖాయంగా ఉన్నది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మక్కాన్ సింగ్, మాజీ శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణ, బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ నడుమ త్రిముఖ పోరు ఉండనున్నది. ఈసారి ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో బయటపడేవిధంగా హోరాహోరీ పోరు ఉన్నది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిని మార్చి కొత్త తలనొప్పి తెచ్చుకోలేమని పైగా చందర్ అయితేనే మిగతా అభ్యర్థులకు దీటుగా అన్ని వనరులను సమకూర్చుకోగలడని పైగా రామగుండంలోని ప్రతి మూలను ఔపోషాన పట్టిన చందరే బరిలో ఉండటం మేలనే నిర్ణయానికి వచ్చిన పార్టీ చివరికి చందర్కే పగ్గాలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. చివరి నిమిషయంలో పరిస్థితులు తారుమారయితే తప్ప రామగుండం బీఆర్ఎస్ టికెట్ కోరుకంటికే అనేది ఖాయంగా కన్పిస్తోంది.టికెట్ ఖాయమనే సంకేతాలు అందుకున్న కోరుకంటి అసమ్మతి నేతలను బుజ్జగించి పనిలో ఉన్నట్లుగా సమాచారం.అయితే అసమ్మతి నేతలు కోరుకంటితో సయోధ్యకొస్తారా? లేక తమలో నుంచి ఒకరిని బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నిలబెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.కోరుకంటి చందర్ 2018 ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు మీద బీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై విజయం సాధించారు. అనంతరం ఆయన కారెక్కారు. ఇప్పుడు కారు స్టీరింగ్ ఆయన చేతికే రావడం విశేషం. రామగుండం ఓటర్లు ఎప్పుడూ విలక్షణ తీర్పు ఇస్తుంటారు. ఇక్కడ గెలుపొటములను ప్రభావితం చేసే అంశాలు విశేషంగా ఉంటాయి.ఈ సారి ఏ ఏ అంశాలు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.