Homeహైదరాబాద్latest Newsపెద్దపల్లి ఎంపీ రేసులో ‘కొయ్యల ఏమాజీ’

పెద్దపల్లి ఎంపీ రేసులో ‘కొయ్యల ఏమాజీ’

  • నేతకాని సామాజిక వర్గానికి టిక్కెట్ దక్కే అవకాశం
  • మంచిర్యాల జిల్లా రెండుచోట్ల మాదిగలకు ఇస్తే ఏమాజీకి లైన్ క్లియర్
  • బీజేపీ అగ్ర నాయకుల ఆశీస్సులు ఏమాజీకే?
  • 3 లక్షల నేతకాని ఓట్లు ఉండడంతో టిక్కెట్ వస్తుందన్న ధీమా

ఇదేనిజం, బెల్లంపల్లి : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపెల్లి ఎంపీ స్థానానికి బీజేపీ జిల్లా నాయకుడు కొయ్యల ఏమాజీ పోటీ పడుతున్నారా..? ఎస్సీ నేతకాని సామాజికవర్గం నుంచి ఆయన టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారా..? బెల్లంపల్లి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి నిరాశకు గురైన ఏమాజీ ఎంపీగా బరిలో ఎలాగైనా నిలవాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన బీజేపీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఎన్నికల కదనరంగంలో దూకేందుకు రాజకీయ వ్యూహాలు రచిస్తుండడం గమనార్హం. విద్యావంతుడైన ఏమాజీ పట్ల పార్టీ అధిష్టానం సైతం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ‘ఇదేనిజం’ ప్రత్యేక కథనం.

ఎలాగైనా పోటీలో నిలవాలని…

బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న ఏమాజీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. చివరి క్షణం వరకు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కాగా అధిష్టానం మాత్రం బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవికి కేటాయించింది. దీంతో కొంత నిరాశకు లోనయ్యారు. ఏమైనప్పటికీ ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవాలని టిక్కెట్ వేటలో పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నాయకులను ఆయన ప్రత్యేకంగా కలిసి వస్తుండడం ఇందులో భాగంగానే కనిపిస్తోంది.

సంస్థాగతంగా పార్టీ బలోపేతం…

గత దశాబ్ద కాలంగా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గంలో బీజేపీని ఏమాజీ బలోపేతం చేస్తున్నారు. బీజేపీ ఉనికి లేకపోయినా.. సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా ఎంతో మార్పు తీసుకురావడానికి ఆయన కృషి చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి తోడు నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టారు. పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న ఏమాజీ బలమైన సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఇక్కడ నేతకాని సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. దాదాపు మూడున్నర లక్షల పైచిలుకు ఓట్లు నేతకాని వారివే ఉంటాయి. ఇదే సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఏమాజీకి పార్టీ అగ్రనేతలు టిక్కెట్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని పరిశీలకులు సైతం అంచనా వేస్తున్నారు.

ఎస్.కుమార్‌కు అవకాశం లేనట్లేనా..?
గత పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్.కుమార్‌కు ఈసారి టికెట్ దక్కే అవకాశాలు తక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. అయన ఇప్పటి వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి నామమాత్రపు ఓట్లు పొందారు. కావున పార్టీ అధిష్ఠానం కొత్త అభ్యర్థిని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img